Nov 07,2023 21:36

మండల పరిషత్‌ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్న నాగేపల్లివాసులు

          ప్రజాశక్తి-కుందుర్పి   మండల పరిధిలోని నాగేపల్లి నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగేపల్లి-శ్రీమజ్జనపల్లి గ్రామాల మధ్య ఉన్న తాగునీటి బోరు పని చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందన్నారు. దీంతో చేసేది లేక దాదాపు 15 రోజుల నుంచి కర్ణాటక రాష్ట్రం పరుశురాపురం వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయంపై స్థానిక సర్పంచి, పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోలేదన్నారు. చేసేది లేక ధర్నాకు దిగామన్నారు. సమస్య పరిష్కరించేంత వరకూ ధర్నా విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. వీలైనంత తర్వగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ విషయంపై ఎంపిడిఒ లక్ష్మీనరసింహాను వివరణ కోరగా త్వరలో గ్రామాన్ని సందర్శించి తాగునీటి సమస్యను పరిష్కరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది నాగేపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.