Oct 22,2023 18:42

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
              న్యాయవిద్యలో దేశంలోనే చాలా ప్రాముఖ్యత కలిగిన అవార్డుకు చెన్నైలోని హిందూస్థాన్‌ స్కూల్‌ ఆఫ్‌ లా ఎంపికైంది. దానికి డీన్‌గా వ్యవహరిస్తున్న భీమవరం పట్టణానికి చెందిన ప్రొఫెసర్‌ పివి.నాగేంద్రశర్మ అవార్డు అందుకున్నారు. ఏలూరు సిఆర్‌ రెడ్డి లా కళాశాల, కురుక్షేత్ర యూనివర్సిటీల్లో విద్య అభ్యసించిన ఆయన గత మూడు దశాబ్దాలుగా న్యాయ విద్య అధ్యాపకుడిగాను, వివిధ హోదాల్లోనూ పనిచేశారు. తాజాగా అసోసియేటెడ్‌ ఆఫ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండిస్టీ ఆఫ్‌ ఇండియా (అసోచమ్‌) చెన్నైలోని హిందూస్థాన్‌ స్కాల్‌ ఆఫ్‌ లాను బెస్ట్‌ అప్కమింగ్‌లా కాలేజీగా గుర్తించారు. దీనికి నాగేంద్రశర్మ డీన్‌ హోదాలో కొనసాగుతున్నారు. ఈ నెల 20న ఢిల్లీలో జరిగిన భారత్‌ లీగల్‌ కాన్క్లేవ్‌-2023లో భీమవరం పట్డణానికి చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ పమ్మి వెంకట నాగేంద్రశర్మ కేంద్ర న్యాయ శాఖామంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. అసోచమ్‌ ఏటా వివిధ రంగాల్లోని వ్యక్తులకు, సంస్థలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ సారి న్యాయవిభాగానికి సంబంధించి ఉత్తమ న్యాయ కళాశాలకు కూడా అవార్డు ప్రదానం చేశారు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ అవార్డులను ఎంపిక చేయగా తొలి అవార్డును నాగేంద్రశర్మ పర్యవేక్షణలోని కళాశాల ఎంపికవ్వడం విశేషం. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు ఉన్న ప్రాధాన్యత దృష్డ్యా ప్రమాణాలతో కూడిన న్యాయవాద విద్య అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నాగేంద్రశర్మ తెలిపారు. నాగేంద్రశర్మ కేంద్రమంత్రి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం పట్ల భీమవరం పట్టణానికి చెందిన విద్యావేత్తలు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.