నాగార్జున యూనివర్శిటీలో డిప్లొమో ఇన్ జర్నలిజం కోర్సు
ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు
ప్రజాశక్తి - శ్రీశైలం
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో డిప్లొమో ఇన్ జర్నలిజం కోర్సు ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు తెలిపారు. బుధవారం రాత్రి శ్రీశైలం చేరుకున్న ఆయనకు ఇఒ, దేవస్థానం పండితులు, అర్చకులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. గురువారం ఉదయం ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిజం కోర్సుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ను విడుదల చేశామన్నారు. ప్రామాణికత కలిగిన సిలబస్ రూపొందించనున్నట్లు తెలిపారు. జర్నలిజం కోర్సు బోధనలో విశేష అనుభవం వున్న నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగ అధిపతి డా. అనిత, ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం విభాగ మాజీ అధిపతి డా. బాబీ వర్ధన్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఎల్‌వికె.రెడ్డిలతో సిలబస్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. పాఠ్యాంశాల రూపకల్పన దాదాపు పూర్తి కావస్తోందని తెలిపారు. జర్నలిస్టులకు ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత, జర్నలిజంలో అభిరుచి కలిగిన ఇతరులకు డిగ్రీ అర్హతగా నిర్ణయించామన్నారు. విద్యార్హతలు కలిగిన వారికి నాగార్జున యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించి సంబంధించిన డిప్లమో సర్టిఫికెట్ అందిస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం ఆ యూనివర్సిటీతో కుదుర్చుకున్నామని తెలిపారు. అయితే జర్నలిస్టులుగా పని చేస్తూ డిగ్రీ ఉత్తీర్ణత లేని వారి భ్యర్ధన మేరకు ఒక ప్రత్యేక ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరీక్షలతో సంబంధం లేకుండా 60 శాతం హాజరు కలిగి, పాఠ్యాంశాలను అనుసరిస్తూ ఎస్సైన్మెంట్‌లు పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిజం కోర్సు స్టడీ సర్టిఫికెట్‌ను అందించనున్నామని వెల్లడించారు. వివరాలకు 9154104393ను సంప్రదించాలన్నారు.
వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కింద జర్నలిస్టులకు ప్రయోజనం
గత ఏడాది (2022-23) జర్నలిస్టులకు వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ పధకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల 21 లక్షలు ఖర్చు చేసి నగదు రహిత వైద్య సేవలు అందించిందని ఆయన తెలిపారు. ఇటీవల వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ ఆరోగ్య ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిని కలిసి జర్నలిస్టులకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ఒక వినతి పత్రం అందజేశామన్నారు. దీనిపై సిఇఒ రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ అమలులో ఎదురవుతున్న సమస్యలు ఎప్పటికప్పుడు తమ దృష్టికి తెచ్చి సత్వర పరిష్కారం పొందేందుకు '104 హెల్ప్ లైన్'లో ప్రత్యేకంగా ఒక లైన్ (నెం.4)ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారన్నారు. ఒక నెల రోజులలోపు ఈ ఏర్పాటు అమలులోకి వస్తుందని చెప్పారు. ఈ పథకంలో 8,669 మంది జర్నలిస్టులు, వారిపై ఆధార పడిన 26 వేల 707 మంది కుటుంబ సభ్యులు నమోదయ్యారని తెలిపారు.
జర్నలిస్టులు రచించిన పుస్తకాల కొనుగోలుకు ప్రాధాన్యత
జర్నలిస్టులు రచించిన పుస్తకాలను గ్రంధాలయ సంస్థ కొనుగోలు చేసేందుకు తమ అభ్యర్ధన మేరకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి గ్రంధాలయాల డైరెక్టర్ లిఖిత పూర్వకంగా తమకు తెలియజేశారన్నారు.
అక్రిడిటేషన్‌ల జిఒ 38 జారీ : అక్రిడిటేషన్‌లకు సంబంధించి ప్రభుత్వం ఇటీవలే జిఒ 38ని జారీ చేసిందని చైర్మన్ పేర్కొన్నారు. ప్రస్తుతం వున్న బస్ పాస్‌ల కొనసాగింపునకు సమాచార శాఖ, ఆర్‌టిసి అధికార్లను లేఖ ద్వారా కోరినట్లు కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి తమకు తెలిపారన్నారు. రాష్ట్ర, జిల్లా అక్రిడిటేషన్ కమిటీల్లో మహిళలకు ప్రాధ్యాన్యం ఇవ్వనున్నారని, ఆ కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రెస్ అకాడమీ సెక్రెటరీ ఎం.బాలగంగాధర తిలక్, దేవస్థానం పిఆరఒ టి.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.










