ప్రజాశక్తి - కాళ్ల
కోమటిగుంట గ్రామానికి చెందిన మంతెన నాగాంజనేయులు చిన్నవయసులోనే తెలుగుదేశం పార్టీలో వివిధ పదవులు నిర్వహిస్తూ వ్యాపారంలో రాణిస్తూ పదిమందికి మంచి చేయాలనే లక్ష్యంతో వివిధ అభివృద్ధి పనులు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకవైపు నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరోవైపు సామాజిక స్పృహతో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ప్రజలకు ఆపన్నహస్తంగా నిలుస్తున్నారు. పుట్టిన ఊరిపై మమకారంతో ఆరేళ్లుగా కోమటిగుంటలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఉన్నత స్థితికి చేరారు. వ్యాపారంలో సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నారు.
తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా రెండు ఫ్రీజర్లు ఏర్పాటు
మంతెన సన్యాసిరావు, నాగమణి జ్ఞాపకార్థంగా రెండు ఫ్రీజర్లను కొనుగోలు చేసి గ్రామస్తులకు అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా ఒక షెడ్డు నిర్మించారు.
పలు అభివృద్ధి పనులు
గ్రామ ప్రజల సౌకర్యం కోసం పంట కాలువపై కాలిబాట వంతెనను రూ.1.50 లక్షలతో నిర్మించారు. కోమటిగుంట గ్రామంలో కోదండ రామాలయం వీధిలో సిమెంట్ డ్రెయినేజీ నిర్మాణ పనులు రూ.2 లక్షలతో చేపట్టారు. రామాలయంలో భోజనశాల ఏర్పాటుతో పాటు గార్డెన్‌లో మొక్కలు నాటారు. రామాలయంలో భక్తులకు నీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు వాష్ బేసిన్లు ఏర్పాటు చేశారు. సూర్యారావుపేట ప్రాంతంలో ఆంజనేయస్వామి, ముత్యాలమ్మ ఆలయాల్లో కూడా వాష్ బేసిన్లు ఏర్పాటు చేశారు.
ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమాలు
గ్రామంలో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు ప్రతిఏడాది నిర్వహిస్తున్నామన్నారు. శ్రీరామనవమి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కోమటిగుంట గ్రామంలో కెవిఎల్ సీఫుడ్స్ సంస్థ అధినేత మంతెన నాగాంజనేయులు ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాల సందర్భంగా అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా మంతెన నాగాంజేయులు ఆధ్వర్యంలో ఎంఎల్‌ఎ మంతెన రామరాజును ఘనంగా సత్కరించారు.
గ్రామావృద్ధికి తోడ్పాడతా
మంతెన నాగాంజనేయులు
కరోనా సమయంలో పేద ప్రజలకు రూ.1.50 లక్షల విలువైన కూరగాయలు, నిత్యావసర సరుకులు మూడు సార్లు పంపిణీ చేశాను. ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు చేతులమీదుగా 50 మంది భక్తులకు దుస్తులను పంపిణీ చేశాం. రామాలయం అర్చకునికి కాసు బంగారాన్ని అందించాం. నావంతు సహకారం అందిస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పాడుతున్నారు.