సంక్లిష్టమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు నెలకొన్న నాగాలాండ్‌లో భద్రతాదళాలు పద్నాలుగు మంది పౌరులను ఊచకోత కోయడం అత్యంత దారుణం. మయన్మార్‌తో సరిహద్దును పంచుకున్న నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఈ ఉదంతం ఈశాన్య ప్రాంతాన్నే కాదు, యావద్దేశాన్ని కలచివేసింది. అమానుషంగా కాల్పులు జరపడమే గాక, చనిపోయినవారి మృతదేహాలను దాచేందుకు అస్సాం రైఫిల్స్ ఫోర్స్ ప్రయత్నించడంతో కోపోద్రిక్తులైన స్థానికులు తిరగబడ్డారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న హింసలో ఒక జవాను చనిపోయాడు. పలు ఆర్మీ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇటువంటి దారుణ మారణకాండలు ఒక్క నాగాలాండ్ లోనే కాదు, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ) అమలులో ఉన్న ప్రతి చోటా చోటుచేసుకుంటున్నాయి. జమ్ము కాశ్మీర్ నుంచి ఈశాన్యం దాకా భద్రతా దళాల అకృత్యాలకు ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ ఒక చట్టపరమైన రక్షణ కవచంగా ఉంది. ఎటువంటి వారెంటు లేకుండా ఎవరినైనా అరెస్టు చేసే, కాల్చివేసే నిరంకుశ అధికారాలను ఈ చట్టం భద్రతా దళాలకు ఇస్తున్నది. ఏం చేసినా జవాబుదారీ వహించక్కర్లేదు. భద్రతా బలగాలు విచక్షణా రహితంగా కాల్పులు జరపడానికి ఇదొక ముఖ్య కారణం. ఈ దారుణ ఉదంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్మీ ఇచ్చిన సంజాయిషీ మృతుల కుటుంబాలకు ఏమాత్రం సాంత్వన ఇవ్వడం కానీ, దేశ ప్రజలను సంతృప్తిపరచడం కానీ చేయలేకపోయింది. గని కార్మికులను నాగా తిరుగుబాటుదారులనుకుని భద్రతా బలగాలు పొరపాటున కాల్చివేశాయని, దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేస్తామని, నెల రోజుల్లోగా నివేదిక వచ్చేలా చూస్తామని అమిత్‌షా పార్లమెంటులో చేసిన ప్రకటన కంటితుడుపు హామీ తప్ప సమస్య తీవ్రతకు తగినట్లుగా లేదు. ఇటువంటి దర్యాప్తులు, కోర్టు ఆఫ్ ఎంక్వయిరీలు గతంలో చాలా జరిగాయి. వాటిలో ఎంతమందిని శిక్షించారో అమిత్‌షా సెలవిస్తే బాగుండేది. భద్రతా బలగాల చర్యను 'పొరపాటు' అన్న ఒక్క పదంతో అమిత్‌షా తేల్చేశారు. ఆ పొరపాటు ఎలా జరిగింది? ఎందుకు జరిగిందో వివరించే ప్రయత్నం చేయలేదు. మొదటిసారి జరిపిన కాల్పులు పొరపాటున జరిగాయని అనుకున్నా, రెండోసారి తొమ్మిది మంది పౌరులను కాల్చివేశారు. దీనిని ఏమనుకోవాలి? అదీగాక సరిహద్దుల్లో కాపలా కాసేందుకు ఉద్దేశించిన సైనిక బలగాలను సొంత దేశ ప్రజలపై ప్రయోగించడమేమిటి? ఈ ప్రశ్నలకు హోం మంత్రి వద్ద సమాధానం లేదు. అస్సాం రైఫిల్స్ ఫోర్స్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియంత్రణ కింద పనిచేసే విభాగం. ఈ ఊచకోతతో తమకు సంబంధం లేదని చెప్పి హోం మంత్రి తప్పించుకుంటామంటే కుదరదు. దీనికి నూటికి నూరు పాళ్లు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నిషేధిత నాగాలాండ్ సోషలిస్టు కౌన్సిల్ (ఖప్లాంగ్- యంగ్ ఆంగ్) ముఠా తిరుగుతున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే భద్రతా బలగాలు దాడి చేశాయని, ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమని అంటున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల ముందు పుల్వామా దాడి కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే జరిగిందన్నారు. ఈ వైఫల్యాలు ఇలా పునరావృతం కావాల్సిందేనా? వీటిని నివారించేందుకు కేంద్ర హోం శాఖ తీసుకున్న చర్యలేమీ లేవు. ఇటీవల అస్సాం రైఫిల్స్ కమాండెంట్ అధికారిని, ఆయన భార్యను, బిడ్డను, మరో ముగ్గురు జవాన్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నదానికి ప్రతీకారంగానే నాగాలాండ్ ఘటన జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని నివృత్తి చేయాల్సిన అవసరముంది. మోన్ ఘటనతో నాగాలాండ్‌లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రతియేటా పది రోజుల పాటు నిర్వహించే హార్న్‌బిల్ గిరిజన జాతరను నాగాలాండ్ ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరో వైపు భద్రతా దళాల ఘాతుకానికి నిరసనగా నాగాలాండ్ లోని అతి పెద్ద తెగగా ఉన్న కొనాయక్‌లు మోన్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. 70 ఏళ్ల నాగా తీవ్రవాద చరిత్రకు ముగింపు పలుకుతూ 1997లో ఎన్.ఎస్.సి.ఎన్ (ఐ.ఎం)తో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఊచకోతకు కారకులైన వారిని గుర్తించి చట్టపరంగా శిక్షించడం, బాధితుల కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు ఎక్స్‌గ్రేషియోతో సహా అవసరమైన అన్ని చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరముంది. అంతకన్నా ముఖ్యంగా సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. తద్వారా ఈశాన్య ప్రాంతంలో శాంతిని కాపాడాలి.










