
ప్రజాశక్తి-గన్నవరం: గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో నాడు ేడు నిధుల దుర్వినియోగంపై విద్యాశాఖ అధికారుల విచారణ మంగళవారం జరిగింది. ఈ పాఠశాలలో నాడు నేడు నిధుల దుర్వినియోగం వ్యవహారంలో హెచ్‌ఎం కీలక పాత్ర పోషించారని జిల్లా పరిషత్ కో ఆప్షన్స్ సభ్యులు ఎండి గౌసాని సీఎంఓ కు ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం గుడివాడ డివైఈవో పద్మ రాణిని విచారణకు పంపగా ఆమె పాఠశాలకు వచ్చి విజిట్ చేయడంతో పాటు నాడు నేడు పనులకు ఖర్చుపెట్టిన వివరాలు వాటి తాలూకా బిల్లులు మొత్తం పరిశీలన చేయడంతో పాటు వాటిని తమకు అప్పగించాలని చెప్పారు. నిధుల దుర్వినియోగం వ్యవహారం పై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణకు వచ్చినట్లుగా ఆమె చెప్పారు. నాడు నేడు పనుల్లో మొదటి విడత, రెండో విడతలో జరిగిన పనులకు సంబంధించి పెట్టిన ఖర్చులు బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నివేదిక పైకి పంపుతామని వివరించారు. ఇదే వ్యవహారంలో గతంలో ఓ అధికారి వచ్చి విచారణ చేసిన తర్వాత నివేదిక ఇవ్వకుండా మధ్యలో వైదొలిగిన విషయం తెలిసిందే.