నాడు వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు, నేడు గిరిజన యూనివర్సిటీ రెండూ పేరుకు సాలూరు నియోజకవర్గంలోనే ఉన్నాయి. కానీ వీటితో నియోజకవర్గాని ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితి నెలకొంది. వీటి వల్ల వెనుకబడిన నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం దోహద పడవు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రగతి ఫలాలు అందించలేవు. ఎందుకుంటే అప్పుడున్న, ఇప్పుడు న్న పెత్తందార్ల స్వార్ధానికి సాలూరు నియోజకవర్గం బలిపశువుగా మారుతోంది. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా సాలూరు నియోజకవర్గం తయారైంది. అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే వారు లేక పెత్తందార్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది.
ప్రజాశక్తి - సాలూరు: సుమారు నాలుగు న్నర దశాబ్దాల క్రితం శంకుస్థాపన చేసిన వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు పేరుకు సాలూరు మండలంలోని లక్ష్మీపురంలో ఉంది. 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 24,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం కల్పించేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. అయితే ఈ ప్రాజెక్టు సాలూరు నియోజకవర్గంలో ఉన్నా సాలూరు మండలం, మున్సిపాలిటీ, పాచిపెంట, రామభద్రపరం మండలాల్లో ఎకరా భూమికి కూడా సాగునీరందని పరిస్థితి. తొలుత ఈ ప్రాజెక్టును సాలూరు మండలంలోని సారిక పంచాయతీ దండిగాం వద్ద నిర్మించాలని భావించారు. ఇక్కడ నిర్మిస్తే మండలంలోని మామిడిపిల్లి, మరిపిల్లి, మామిడిపల్లి, బాగువలస, పురోహితునివలస గ్రామాలకు సాగునీటి సౌకర్యం కలిగేది. అయితే ఈ డిజైన్‌ను అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి వాసిరెడ్డి కష్ణమూర్తి నాయుడు మార్పించి ఈదుల దండిగాం వద్ద నిర్మించడానికి ప్రణాళిక రూపకల్పన చేశారు. విఆర్‌ఎస్ జలాశయం నుంచి నీరు తీసుకుపోయేలా పార్వతీపురం, బొబ్బిలి నియోజకవర్గాల్లో భూములకు సాగునీరందించేలా రూపకల్పన చేసి కాలువల నిర్మాణం చేపట్టారు. ఈ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న జన్ని ముత్యాలు నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేకపోయారు. అయితే సాలూరుకు చెందిన పలువురు నాయకులు కోర్టులో కేసు వేసినా ప్రయోజనం లేకపోయింది. సాలూరు మండలంలోని కొండకోనల్లో నుంచి జాలువారిన నీరు సువర్ణముఖి, గోముఖి అనే పాయల ద్వారా వెంగళరాయ సాగర్ జలాశయంలోకి చేరుతుంది. అప్పుడే నియోజకవర్గ ఎమ్మెల్యే గాని, స్థానిక పెత్తందారీ నాయకులు గాని జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి ఉంటే విఆర్‌ఎస్ నీటితో కనీసం మండలంలోని భూములైనా సస్యశ్యామలమయ్యేవి. కానీ ప్రశ్నించే నాయకులు, నిలదీసే ప్రజలు లేకపోవడంతో పెత్తందారీ నాయకులు వారి ఓటు బ్యాంకు రాజకీయాలకు అనుకూలంగా ప్రాజెక్టును వాడుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నియోజకవర్గానికి అన్యాయం జరుగుతూనే ఉంది.
తాజాగా కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ విషయంలో కూడా నియోజకవర్గానికి అన్యాయమే జరిగింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజన్నదొరను ఉత్సవ విగ్రహంగా చేసి జిల్లా రాజకీయాలను శాసించే నాయకులు గిరిజన యూనివర్సిటీని విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయించుకున్నారు. పేరుకు సాలూరు నియోజకవర్గంలో ఉన్నట్టు తాత్కాలికంగా కనిపిస్తున్నా భవిష్యత్తులో పూర్తిగా విజయనగరం జిల్లాకే చెందుతుంది. నియోజకవర్గ పరిధిలోని మెంటాడ మండలం ఇప్పుడు విజయనగరం జిల్లా లోనే ఉంది. మరో మూడేళ్లలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనలో మెంటాడ మండలం గజపతినగరం నియోజకవర్గంలోకి వెళ్లిపోతుంది. ఇటీవల సిఎం జగన్ మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేయించారు. కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాకు తీరని అన్యాయం చేసినట్లయింది. నాడు వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే జన్ని ముత్యాలు ప్రశ్నించలేకపోవడం వెనుక పెత్తందారీ రాజకీయాలు అప్పట్లో బలంగా వుండడమే కారణమని చెప్పవచ్చు. ఇప్పుడున్న ఎమ్మెల్యే రాజన్నదొర డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హౌదాలో ఉన్నప్పటికీ కళ్లముందు కనిపించే అన్యాయాన్ని ప్రశ్నించలేకపోయారు. ఉన్నత విద్యావం తుడైనప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి నిలదీయలేక పోయారు. పెత్తందార్ల రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం నియోజకవర్గ అభివృద్ధి పణంగా మారింది. గిరిజనుల ముంగిటే గిరిజన యూనివర్సిటీ అని ప్రచారం చేస్తూ పెత్తందారులు మన్యం జిల్లా గిరిజనులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాడు విఆర్‌ఎస్ ప్రాజెక్టు విషయంలో గానీ, నేడు గిరిజన యూనివర్సిటీ విషయం లో గానీ నియోజకవర్గానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేకపోవడం వెనుక పెత్తందారీ రాజకీయ చట్రంలో గిరిజన ఎమ్మెల్యేలు పావులుగా మారడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.
సాలూరు ప్రాంతంలో వర్శిటీ ఉంటే...
ఒకవేళ కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నియోజకవర్గంలో ఉన్న దుగ్ధసాగరం భూముల్లో గాని, పాచిపెంట మండలంలోని మాన్సాస్ భూముల్లో ఏర్పాటు చేసి ఉంటే వెనుకబడిన గిరిజన నియోజకవర్గ రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంటుంది. టిడిపి ప్రభుత్వ హయాంలో పరిశీలించిన ప్రతిపాదిత మాన్సాస్ భూములకు దగ్గర గానే గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి వెళుతోంది. వైసిపి ప్రభుత్వం హయాంలో పరిశీలించిన దుగ్ధ సాగరం భూములకు కూడా సమీపం నుంచే గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి వెళుతోంది. ఈ రెండు ప్రదేశాల్లో ఎక్కడ ఏర్పాటు చేసినా నియోజకవర్గానికి చెందిన వందలాది మంది కూలీలకు, యువతకు ఉపాధి అవకాశాలు లభించేవి. ఇలాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఏర్పాటైతే ఈ ప్రాంత భూములకు ధరలు పెరిగేవి. ఫలితం సాలూరు పట్టణాభివృద్ధి కూడా ఊహించని రీతిలో జరిగేది. విద్య, వైద్య రంగాల్లో వెనుకబడిన గిరిజన ప్రాంతంలో అభివృద్ధి కుసుమాలు వికసించడానికి మార్గం ఏర్పడేది.










