
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లాలో కీలకమైన వరికపూడిశెల ప్రాజెక్టుకు 70 ఏళ్లుగా కాగితాలకే పరిమితమైంది. నాగార్జున సాగర్ జలాశయం బ్యాక్ వాటర్‌ను ఉపయోగించుకుని నిర్మించే వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లోని వెల్దుర్తి, దుర్గి,మాచర్ల, కారంపూడి, బొల్లాపలి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు,యర్రగొండపాలెం మండలాల్లో మొత్తం 1,04,463 ఎకరాలకు సాగునీరు, 90 గ్రామాలకు తాగునీరు అందుతుంది. వెల్దుర్తి మండలంలోని గంగలకుంట సమీపంలో నల్లమడ అటవీ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు నిర్మించాల్సి
ఉంది. ఈ ఎత్తిపోతల నిర్మాణానికి అనుమతి కోసం దాదాపు 40 ఏళ్లుగా ప్రజా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో అనుమతి లభించింది. 44 ఎకరాల అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా టైగర్ ప్రాజెక్టు కింద కేవలం 48 ఎకరాలు భూమి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తెలిపింది. ఈ పథకానికి ఇప్పటివరకు అనేకమార్లు శంకుస్థాపనలు జరిగాయి. 1997లో అప్పటి సిఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 2008 జూన్ 5వ తేదీన అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత 2018లో టిడిపి హయంలో మూడో సారి శంకుస్థాపన చేశారు. తాజాగా ఈనెల 15న సిఎం జగన్ మరోసారి పనులు ప్రారంభం కోసం శంకుస్థాపన చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అధికారులు చురుగ్గా ఏర్పాట్టు చేస్తున్నారు. సిఎం జగన్ పల్నాడు జిల్లాలో 2018లో జరిగిన పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే వరికపూడి శెల నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జగన్ హామీతో స్పందించిన అప్పటి టిడిపి ప్రభుత్వం 2019 ఫిబ్రివరిలో రూ.1250 కోట్లతో టిడిపి హయంలోనే పరిపాలన ఆమోదంతో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత 2021లో మరో సారి పరిపాలన ఆమోదం ఇస్తూ జీవో ఇచ్చారు. ప్రస్తుతం మెగా ఇంజినీరింగ్ కంపెనీకి ఎత్తిపోతల పనుల నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం రూ.1650 కోట్లకు అంచనాలు పెరిగాయి. ఇందులో తాజాగా రూ.340 కోట్లతో తొలి దశ పనులకు సిఎం జగన్ బుధవారం భూమిపూజ చేయనున్నారు.గత 70 ఏళ్లుగా ప్రజా ప్రతినిదులంతా ప్రతి ఎన్నికల్లో హామీ ఇస్తూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పల్నాటి ప్రజలకు సాగు, తాగునీటిఎద్దడి తొలగనుంది. కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడంతో నర్సరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు కృషి ఫలిచింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్య భాగాలైన పంప్ హౌస్, ప్రెజర్‌మెయిన్, బ్రేక్ ప్రెజర్ ట్యాంక్ మరియు ఇతర నిర్మాణాలు చేపట్టడానికి భూమి అటవీ ప్రాంతంలో ఉంది. ఇది రాజీవ్ గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం, నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యంలో ప్రధాన ప్రాంతంగా ఉంది. నిర్మాణానికి అటవీ భూమి మార్పిడికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. గతంలో రెండుసార్లు బొల్లాపల్లి, దుర్గి, వెల్దుర్తి మండలాల్లో సాగునీటి సౌకర్యాలు సమకూర్చటానికి సవివరమైన బ్లాక్ లెవలింగ్ సర్వే నిర్వహణ, సవివరమైన ప్రాజెక్ట్ నివేదిక (డిపిఆర్) రూపొందించారు. హైడ్రాలిక్ వివరాల రూపకల్పన, సిఎం అండ్ సిడి పనుల డిజైన్లు, మట్టి తవ్వకం, పని అంచనా, సవివరమైన ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పనకు 1వ దశ పని నిమిత్త్తం ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు గతేడాది సర్వే పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు సిపిఎం అనేక పోరాటాలు చేసింది. ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు శాసన మండలి, డిఆర్‌సి, జిల్లా పరిషత్ వంటి అనేక ముఖ్యమైన వేదికలపై ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో పట్టుబట్టారు. ప్రభుత్వంపై వత్తిడి పెంచి కేంద్రం అనుమతి కోసం ఆయన కూడా జిల్లాకు చెందిన మంత్రి అంబటి రాంబాబు వద్ద పలుమార్లు వత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పనులు ప్రారంభంకు ఈనెల 15న సిఎం జగన్ పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టనున్నారు.