Jun 13,2023 00:06

మాట్లాడుతున్న బూడి

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌ జగనన్న విద్యా కానుక నాలుగో విడత పంపిణీలో భాగంగా నాతవరం మండలం నాతవరంలోని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ అధ్యక్షతన స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలల అభివద్ధే ధ్యేయంగా నాడునేడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్య వ్యవస్థలో సమూలమైన, విప్లవాత్మకమైన మార్పులకు విద్య దీవెన, వసతి దీవెన , అమ్మ ఒడి, నాడు - నేడు, గోరు ముద్ద, వంటి పధకాలను అందిస్తూ కార్పొరేట్‌ విద్యా వ్యవస్థకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను రూపొందిస్తున్నామన్నారు. ఈ సంధర్భంగా విద్యార్ధులకు మంత్రి అమర్నాథ్‌, శాసన సభ్యులు ఉమ శంకర్‌ గణేష్‌, జిల్లా కలెక్టర్‌లతో కలిసి విద్యార్ధులకు జగనన్న విద్యా దీవెన కిట్లను పంపిణి చేశారు. మండలంలో 1.65 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రాధమిక అరోగ్య కేంద్రం, సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు.
మంత్రి అమర్నాథ్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పలు పథకాలను ప్రవేశపెట్టి చదువుకి అధిక ప్రాముఖ్యత ఇచ్చారన్నారు.
జిల్లా కలెక్టర్‌ రవిపటాన్‌ శెట్టి మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక వైద్య కేంద్రాలు సమకూర్చి గ్రామాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు.జిల్లాలో జగనన్న విద్యా కానుకతో 1,23, 971 విద్యార్థులు, నాతవరం మండలంలోని 4696 మంది లబ్ధి పొందారన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి అమృత కుమార్‌, ఎంపీపీ సాగిరి లక్ష్మణమూర్తి, వైస్‌ ఎంపీపీలు సునీల్‌, గోపి పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌
మండలంలోని మూలపేట గ్రామంలో సోమవారం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను గ్రామ సర్పంచ్‌ భీశెట్టి గంగప్పలనాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విద్యా కానుక కిట్లలో భాగంగా ప్రతి విద్యార్థికి మూడు జతల బట్టలు, షూ, రెండు జతల సాక్షులు, బెల్ట్‌, 12 బుక్స్‌, రాగి జావ తాగేందుకు ఒక గ్లాసు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం నర్సింగరావు, ఉపాధ్యాయులు సత్యనారాయణ, వార్డు మెంబర్లు ఎల్లపు హైమావతి, మొల్లేటి గోవిందరావు, కాండ్రేగుల వరలక్ష్మి, శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు భీశెట్టి అప్పారావు, కాండ్రేగుల సాంబశివ, ఆడారి ఉమా రామలింగేశ్వరరావు, మొల్లేటి సోమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : జగనన్న విద్యా కానుక కిట్లు 5075 మంది పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం బుచ్చయ్యపేట మండలంలో ప్రాథమిక పాఠశాలలు 49, ప్రాథమికొన్నత పాఠశాలలు 5, ఉన్నత పాఠశాలలు 8, కెజిబివి 1 మొత్తం 63 ప్రభుత్వ పాఠశాలలు పున:ప్రారంభమైనట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పధకం మెనూ ప్రకారం భోజనం విద్యార్థులకు అందించడం చెప్పారు.
ఆరిలోవ :10వ వార్డు పరిధి తోటగరువు, ఎస్‌ఐజి నగర్‌, ఇందిరానగర్‌ మండల ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులకు సోమవారం జగనన్న విద్యాకానుక కిట్లను ఎపి ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పతివాడ వెంకటలకీë అందజేసారు. కార్యక్రమంలో వార్డు వైసిపి అధ్యక్షులు పతివాడ కనకరాజు, కెఆర్‌వి ప్రసాద్‌, పి.శ్రీహరి, సాయి, తోటగరువు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.విశ్వనాధం, రామక్రిష్ణ, పాఠశాల చైర్మన్‌ ఎం.శ్రావణి, రాజు పాల్గొన్నారు.