Sep 14,2023 20:45

నాడు నేదు నిధులతో అందంగా రూపుదిద్దుకున్న ప్రభుత్వ పాఠశాల

ప్రజాశక్తి - ఓజిలి : జగన్‌ మామయ్య చెప్పింది నిజం.. నాడు-నేడుతో పాఠశాలలు కార్పొరేట్‌ను తలదన్నేలా ఉన్నాయి.. చుట్టూ ప్రహరీగోడ, విశాలమైన మైదానం.. అందమైన పెయింటింగ్‌లతో తరగతి గదులు.. పచ్చదనంతో పాఠశాలలు చాలా బాగున్నాయి.. అయితే ఉపాధ్యాయులు లేకుండా అందమైన భవనాల్లో 'అమ్మఒడి' కిట్లు ఒళ్లో పెట్టుకుని విద్యార్థులు కూర్చుని వస్తున్నారు. విద్యార్థులకు సరిపడా టీచర్లు లేకపోవడంతో పాఠాల్లో వెనకబడిపోతున్నామని, ఇప్పటికే పాఠశాలలు తెరచి మూడు నెలలయ్యిందని, ఉపాధ్యాయులు లేక పాఠ్యాంశాలు అర్ధం కావడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.
ప్రాథమిక విద్య అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి చిన్నారికీ విద్యనందించే బాధ్యత పాలకులపై ఉంది. ఆ దిశగా విద్యార్థులకు విద్య సౌకర్యాలు కల్పించి విద్యాబుద్ధులు నేర్పించాలి. పాలకులు మాత్రం ఆ దిశగా దష్టి సారించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాథమిక విద్యావ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడిపోతుందని పలువురు వాపోతున్నారు. మండలంలో నాడు-నేడు కింద సుమారుగా రూ.కోట్లాది రూపాయల వ్యయంతో ప్రభుత్వ పాఠశాల భవనాలు నిర్మాణాలతో పాటు పాత భవనాల మరమ్మతుల పనులు కూడా జరుగుతున్నాయి. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు వెచ్చించింది. భవన నిర్మాణాలు మాట సరే కానీ పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు ఏరి అన్న ప్రశ్న ప్రజలలో తలెత్తుతోంది. విద్యార్థులకు సబ్జెక్టులపై పూర్తి అవగాహన లేక విద్యార్థులు వెనుకబడి పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించకపోవడం పట్ల మెరుగైన విద్యకు విద్యార్థులు దూరమవుతున్నారని విద్యార్థుల, తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పేద పిల్లల విద్య పట్ల చిన్నచూపు సమంజసం కాదంటూ పలువురు నిలదీస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒక్కొక సబ్జెక్టుకు ఒక్కొక్క ఉపాధ్యాయులతో విద్యాబుద్ధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఒప్పంద ప్రతిపాదన మీద రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమిస్తే విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు ఉంటుందని ఆ దశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.