ప్రజాశక్తి-వీరఘట్టం : కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులో నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు కల్పిస్తామంటున్న ప్రభుత్వం ఆర్భాటం ప్రచారాలకే పరిమితమవుతోంది. ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు. ఈ కారణంగా విద్యార్థులు అసౌకర్యాల నడుమ విద్యాబోధన కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిపడా ఉపాధ్యాయులున్నా భవనాల కొరతతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మండలంలోని 2020- 21 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత కింద రూ.7.24 కోట్లతో 31 పాఠశాలల్లో నాడు- నేడు పనులు చేపట్టారు. రెండో విడతలో రూ.10.44 కోట్లతో 30 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. వీటికి సంబంధించి రూ.3.46 కోట్లు ఆయా ఖాతాల్లో జమయ్యాయని, ఇంతవరకు రూ.2.48 కోట్లు ఖర్చయినట్లు విద్యాశాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెగ్యులర్ పాఠశాల, కోమటి వీధి ,కూరాకుల వీధి పాఠశాలలతోపాటు రేగులపాడులోని కెజిబివి, కంబరవలస, కడకల్లా, తదితర గ్రామ పాఠశాలలో మందకొడిగా నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.60 లక్షలతో నాడు-నేడు పనులు చేపడుతున్నారు. ఇక్కడ 260 మందికి పైగా విద్యార్థులున్నారు. ఇదే కళాశాలలో డిగ్రీ కళాశాల తరగతులు నిర్వహించడంతో విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నామని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తి కాకపోవడంతో కాలకృత్యాలకు విద్యార్థులు బయటకు పరుగులు తీస్తున్నారు. కోమటివీధి పాఠశాలలో పనులు పూర్తి కాకపోవడంతో ప్రభుత్వ బాలుర వసతిగృహంలో పాఠశాల నిర్వహణ కొనసాగుతోంది. నలుగురు ఉపాధ్యాయులతో పాటు 70 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
వెంటాడుతున్న భవనాల కొరత
మండల కేంద్రంలోని బిసి కాలనీలో ప్రాథమిక పాఠశాలకు రెండే తరగతి గదులున్నాయి. ఇక్కడ ఆరుగురు ఉపాధ్యాయులు, 122 మంది విద్యార్థులు ఉన్నారు. బోధించేందుకు ఉపాధ్యాయులు సరిపడా ఉన్నప్పటికీ అవసరమైన తరగతి గదులు లేవు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొమ్మిదేళ్ల కిందట ఆర్‌విఎం ఆధ్వర్యంలో రూ.7.30 లక్షలతో అదనపు భవనం నిర్మించినప్పటికీ నిరుపయోగంగా పడి ఉంది. ఇటీవల ఈ పాఠశాలలో నాడు-నేడు పనులు చేపట్టినప్పటికీ కొంతమేర నిధులు వీటికి ఉపయోగిస్తే బాగుండేదని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు.
యు.వెంకంపేట ప్రాథమిక పాఠశాలలో 35 మంది విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకే భవనం కావడంతో విద్యాబోధన, వంటలు అందులోనే. చిట్టపూడివలస ప్రాథమిక పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు, 60 మంది విద్యార్థులున్నా ఒకే భవనం ఉంది. ఇక్కడా విద్యాబోధనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పిల్లల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు కొంత మొత్తాలను పోగు చేసి అదనంగా రేకుల షెడ్డు నిర్మించారు. నాడు-నేడు పనులు త్వరగా పూర్తిచేసి, భవనాలను అందుబాటులోకి తేవాలని, అవసరమైన చోట అదనపు తరగతి గదులు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.










