ప్రజాశక్తి-పాడేరు : మన బడి నాడు నేడు కింద పాఠశాలల్లో చేపడుతున్న అబివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపిడిఓలు, ఎం.ఇ ఓలు, ఎటిడబ్ల్యూఓలు, వెలుగు ఎపిఎంలతో గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 12న పాఠశాలలు తెరిచే నాటికి పాఠశాలల్లో నిర్మాణపు పనులు, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్ల పనులు, వంట గదుల మరమ్మతులు పనులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వేగంగా ''పూర్తి చేయాలని స్పష్టం చేసారు. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా సరఫరా చేస్తున్న సామగ్రిపై ఆరా తీసారు. పాఠశాలలకు రివాల్వింగ్ ఫండ్ ఎంత వచ్చింది అడిగి తెలుసు కున్నారు. పాఠశాలల్లో మరమ్మతులకు అవసరమైన సిమెంటును స్థానికంగా కొనుగోలు చేయాలని సూచించారు. ప్రత్యేకాధికారులకు కేటాయించిన పాఠశాలలను తనిఖీ చేసి మన బడి నాడు నేడు పనుల నాణ్యతలు, నిర్మాణ సామగ్రి నాణ్యతలు, రిజిస్టర్ల నిర్వహణ పరిశీలించాలని పేర్కొన్నారు.జిల్లాలో డ్రాపౌట్లు లేకుండా నూరు శాతం పిల్లలు పాఠశాలలో ఉండే విధంగా తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. ఎంపిడిఓలు, ఎ.ఇ.ఓలు, ఎటిడబ్ల్యూ ఓలు సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించాలని చెప్పారు. ఆశ్రమ పాఠశాలలకు నిత్యావసర సరుకులు పంపిణీ కాంట్రాక్టర్లు ఎంత మంది ఉన్నారని అడిగే తెలుసుకున్నారు. పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో పాడేరు ఐటిడిఏ పిఓ వి.అభిషేక్, రంపచోడవరం పిఓ సూరజ్ గనోరే, డిఇఓ సలీం భాషా, ఐసిడి ఎస్ పి డి సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










