కడప అర్బన్ : జిల్లాలో నాడు-నేడు ద్వారా రెండవ దశలో చేపట్టిన పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల అభివద్ధి పనులను పెండింగ్ లేకుండా తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ వి.విజరు రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ స్పందన హాలులో అన్ని పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల ఆరోగ్యం, మనబడి 'నాడు నేడు' ఫేస్-2 పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండవ దశ నాడు-నేడు పనులకు సంబంధించి అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే దాదాపు పూర్తి చేశారని పేర్కొన్నారు. ఇంకనూ పెండింగ్ లోవున్న వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పేరెంట్స్ కమిటీ అకౌంట్లలో నిధులు కూడా సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. సంబంధిత నిధులను వెచ్చించి ఆయా పాఠశాలల్లో అన్ని రకాల అభివద్ధి పనులను పెండింగ్ లేకుండా పూర్తిస్థాయిలో చేపించాలన్నారు. నాడు-నేడు పనులను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నాణ్యతలో సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మండల ఇంజినీరింగ్ అధికారులు, ఎంఇఒలు రోజూ ఐదు పాఠశాలలను పర్యవేక్షణ చేయాలన్నారు. సిడిపిఒలు చొరవ తీసుకుని అంగన్వాడీ కేంద్రాలలో నాడు నేడు ద్వారా అభివద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు. నిధులు ఉన్న పాఠశాలల్లో ప్రతి వారం 20శాతం ఖర్చు చూపాలన్నారు. పనుల నిర్వహణలో నాణ్యతా లోపాలు వుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను కచ్చితంగా అనుసరించాలన్నారు. ఈ విద్యాసంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలతో పాటు అన్ని తరగతుల ఆకాడమిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. స్కూల్ పిల్లలకు సిలబస్ ప్రకారం పాఠ్యఅంశాలు భోధిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఆరాతీయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సెలవుల విషయంలో పరిమితికి మించి అనుమతివ్వకూడదన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దష్టి సారించాల్సిన నైతిక బాధ్యత ఎంఇఒలదే అని చెప్పారు.. స్థానిక పిహెచ్‌సి వైద్యుల ద్వారా ప్రతి విద్యార్థికీ వైద్య పరీక్షలు చేయించాలని పేర్కొన్నారు. స్థానిక సచివలయాల్లోని వేల్ఫేర్, ఎడ్యుకేషన్ సెక్రెటరీలను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ విద్యార్థుల, పాఠశాలల అభివద్ధికి దోహదపడాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి విద్యార్థుల్లో చదువుపై మక్కువ పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి, ఐసిడిస్ పీడీ శ్రీలక్ష్మితో కలిస విద్యాశాఖ, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఇంజినీరింగ్ అధికారులు పంచాయతీరాజ్, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్, మండల ఇంజినీర్లు, ఇంజినీరింగ్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.










