ప్రజాశక్తి-బాపట్ల రూరల్: విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నాడు-నేడు కింద పాఠశాలలన్నింటిలో చేపట్టిన అభివద్ధి పనులను పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు. బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలోని జడ్పీ ప్రాథమికోన్నత పాఠశాలలో రూ.42 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పాఠశాలలో ఆయన కలియతిరిగారు. ప్రతి తరగతి గదిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులపై ఆరా తీశారు. తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలోనే పనులు కొనసాగాలని అన్నారు. పాఠశాల ప్రారంభానికి ముందుగానే భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రాథమికంగా మరుగుదొడ్లు, విద్యుత్, మంచినీటి సదుపాయం కల్పించాలని ఆయన సూచించారు. డిజిటల్ తరగతి గది పనులలో పురోగతి ఉండాలని చెప్పారు. అన్ని పాఠశాలలకు ఏర్పాటు చేస్తున్న ల్యాబ్‌లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న విద్యాకానుక కిట్‌లో విద్యార్థులకు పంపిణీ చేయనున్న వస్తువులను ఆయన నిశితంగా పరిశీలించారు. పాఠశాలకు వచ్చిన రాతపుస్తకాలు, పాఠ్య పుస్తకాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్దేశించిన 10 అంశాలలో రూ.15.32 లక్షల విలువైన పనులు జరిగాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆయన వెంట బాపట్ల ఆర్‌డిఒ జి రవీందర్, డీఈవో పీవీ రామారావు, తహశీల్దారు సుధారాణి, ఎంపీడీవో రాధాకృష్ణ, పలువురు అధికారులు, తదితరులు ఉన్నారు.










