
ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలో జరుగుతున్న నాడు నేడు పనుల్లో నాణ్యత ప్రమాణాలు విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవిపట్టన్‌శెట్టి ఆదేశించారు. బుధవారం మండలంలో పలు గ్రామాల్లో వర్షాన్ని లెక్క చేయకుండా ఆయన పర్యటించారు. ముందుగా కృష్ణదేవిపేట గ్రామంలో ఉపాధి పనులను పరిశీలించారు. పనుల వద్ద మస్తర్లు వేసే విధానాన్ని, చేసిన పనులకు కొలతలు వేసే విధానాన్ని కూలీల ద్వారా ఆరా తీశారు. వేతనాలు చెల్లింపుల విషయంపై కూడా ఆయన కూలీలతో మాట్లాడారు. గ్రామాల్లో జాబ్ కార్డులు వున్న ప్రతి ఒక్కరూ పనులకు హాజరు కావాలని ఆయన సూచించారు. అనంతరం కొంగసింగి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆయన సందర్శించారు. బుధవారం గ్రామంలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంపై వైద్య బృందాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విలేజ్ క్లినిక్ ద్వారా అందుతున్న వైద్య సేవలపై అధికారులుతోను, ప్రజలతోను మాట్లాడారు. గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికలు, అంగన్వాడీ చిన్నారులు, రక్తహీనత ఉన్న వారి సమస్యలపై డిఎంహెచ్‌ఒ హేమంత్, వైద్యాధికారిని గాయత్రితో చర్చించారు. అనంతరం ఏఎల్‌పురంలో నిర్మాణ దశలో ఉన్న నాడు నేడు పనులను పరిశీలించారు. ఎంపిపి పాఠశాలలో 22 లక్షలతో ప్రారంభమైన పనుల్లో భాగంగా వాటర్ ట్యాంకు మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాడు నేడు పనులకు సంబంధించి రికార్డులను అడిగిన వెంటనే చూపించక పోవడంపై స్థానిక ప్రధానోపాధ్యాయులు, నాడు నేడు పనుల జెఇ సత్యనారాయణలపై అసహనం వ్యక్తం చేశారు. హైస్కూల్లో నిర్మాణ దశలో ఉన్న నాడు నేడు పనులను కూడా పరిశీలించారు. అనంతరం కృష్ణదేవిపేట పిహెచ్‌సిని సందర్శించారు. పీహెచ్సీలో మందుల స్టాక్‌ను పరిశీలించి సిబ్బంది పనితీరును సమీక్షించారు. పిహెచ్‌సికి గతంలో ఉన్న అంబులెన్స్ లేదని దీనివలన అత్యవసరమైన కేసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యాధికారి హరిప్రవీణ్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులతో మాట్లాడి అంబులెన్స్ వాహనాన్ని పిహెచ్‌సికి ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొయ్యూరు, గొలుగొండ మండలాలకు చెందిన ప్రజలకు సేవలందిస్తున్న కృష్ణదేవిపేట పిహెచ్‌సికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిఎంఅండ్ హెచ్‌ఓ హేమంత్ కుమార్‌ను ఆయన ఆదేశించారు. కొంగసింగిలో నిర్మాణం పూర్తయిన సచివాలయ భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం గొలుగొండలో పి హెచ్‌సిని ఆయన సందర్శించి నాడు నేడు పనులను పరిశీలించారు. చీడిగుమ్మల గ్రామంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన కస్టం ఐరింగ్ సెంటర్‌లో రైతులకు మంజూరైన ట్రాక్టర్లను స్ప్రేయర్లను జడ్పిటిసి సుర్ల గిరిబాబుతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో జయరాం, మండల ప్రత్యేకాధికారి కూర్మినాయుడు, హౌసింగ్ డిఈ ఫణీంద్ర, పిఆర్ డిఈ ప్రసాదరావు, ఏడిఏ వి.మోహన్‌రావు, ఇన్‌చార్జ్ తహశీల్దార్ ఆనందరావు, ఎంపిడిఒ డేవిడ్‌రాజు, ఎంపిపి గజ్జలపు మణికుమారిలతో పాటు పలు శాఖల మండల స్థాయి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు