ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేపడుతున్న నాడు నేడు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి బెన్న స్వామి సూచించారు. మండలంలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం నాడు నేడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు నేడు పనులకు సంబంధించిన ఖర్చులను కళాశాల కమిటీ తీర్మానం చేశాకే చెల్లింపులు చేయాలని, ముందస్తుగా ఎవరికి ఇవ్వవద్దని కళాశాల ప్రిన్సిపల్‌కు సూచించారు. నిబంధనలకు లోబడే పనులు చేయించి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. భవన నిర్మాణాల్లో ఎటువంటి జాప్యం జరగకుండా, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు భవనాలను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాలన్నారు. ఈ నెల 12 నుంచి 17 వరకు జరిగే అర్ధ సంవత్సర పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది దామోదరం, రమణ, రమేష్ పాల్గొన్నారు.










