ప్రజాశక్తి-అనంతగిరి:మొదటి విడత నాడు నేడు పనులలో నాన్యత లోపం, ఆర్వోప్లాంట్ మూలకు చేరడం, విద్యా బోధనలో నిర్లక్ష్యం, పాఠశాల గదులు సరిగా లేక పోవ్వడంపై రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖ అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ పర్యటనలో భాగంగా శనివారం అనంతగిరి మండలంలో పర్యటించి రాత్రి స్థానిక హరితహిల్ రెస్టారెంట్‌లో బస చేశారు. ఆదివారం చిలకలగెడ్డ ఎంపీపీఎస్ పాఠశాలలో నాడు నేను పనులను పరిశీలించారు. మొదటి విడతగా పాఠశాలలో రూ.1.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ పని చేయక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాటు చేయడమే కాదని పర్యవేక్షణ బాధ్యత అధికారులపై ఉందని మండిపడ్డారు. నాడు నేడు పనులలో నాణ్యత లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠ్య పుస్తకాల స్టాక్‌రూమ్‌ను పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాలు లోటు లేకుండా విద్యార్థులకు అందజేయాలని డీఈవో, ఎంఈఓలకు సూచించారు. విద్యా కానుకలో బ్యాగులు,. బూట్లు, యూనిఫాంలో నాణ్యత లేకపోతే సహించేది లేదన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. సింగిల్ స్కూల్ టీచర్స్ ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయుడు అత్యవసర సమయంలో సెలవు పెట్టినప్పుడు సిఆర్పీలు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లి బోదించాని ఆదేశించారు. చిలకలగెడ్డ గ్రామంలోని విద్యార్థుల ఇంటికి వెళ్లి ఐరన్ మాత్రలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహశిల్దార్ రాంబాయి, ఇన్‌చార్జీ ఎంపిడిఒ కుమార్ ఉన్నారు
జెడ్‌పిటిసి గంగరాజు వినతి
అనంతగిరి: రాష్ట్రంలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న సిఆర్‌టిలు, బాష వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌కు అనంతగిరి జడ్పిటిసి దీసరి. గంగరాజు. సీపీఎం నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జడ్పిటిసి దీసరి. గంగరాజు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు టీచర్స్ సి.ఆర్.టిలు గత 20. సంవత్సరాలుగా పని చేస్తున్నారని, వీరిని రెగ్యులర్ చేయాలని కోరారు. సిఆర్.టిలు గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యకు ప్రతినిత్యం అందిస్తున్నారని తెలిపారు. వీరిని రెగ్యులర్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. మాతృభాష వాలంటీర్లు కొండ, ఒరియా, సవరా లో బోధిస్తూ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన చేస్తున్నారని తెలిపారు.ప్రైమరీ పాఠశాలల తొలగింపును విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టోకురు సర్పంచ్ కిల్లో మోస్య, సిపిఎం మండల కార్యదర్శి సోమెల నాగులు, సురేష్ పాల్గొన్నారు.
డుంబ్రిగూడ:మండలంలోని స్థానిక గవర్నమెంట్ హై స్కూల్లో శనివారం రాత్రి రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్లో నిర్మిస్తున్న నాడు నేడు పనులను పరిశీలించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.










