ప్రజాశక్తి-విఆర్.పురం
నాడు- నేడు పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, వీటికి సంబంధించి విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిషత్ సర్వసభ సమావేశం ఎంపిపి కారం లక్ష్మి అధ్యక్షతన మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ముందుగా మండల అధికారులు శాఖల వారిగా సమీక్ష నిర్వహించారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. వెలుగులో అవినీతి జరిగిందని, సంబంధిత అధికారులపై చర్యలే తీసుకొని, వారి నుండి డబ్బులను రికవరీ చేయాలని శ్రీరామగిరి సర్పంచ్ పులి సంతోష్ కుమార్, చిన్న మట్టపల్లి ఎంపిటిసి పూనెం ప్రదీప్ కుమార్ డిమాండ్ చేశారు. పలు సమస్యలపై సభలో అధికారులను వారు నిలదీశారు. రామవరం, రామవరం పాడు గ్రామంలో ముంపు జాబితాలో లేని 104 కుటుంబాలను సర్వే చేసి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత కుటుంబాల పల్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. ఆర్ అండ్ ఆర్ పోలవరం పునరావాసం కాలనీలు వెంటనే పూర్తి చేయాలని, గ్రామంలో ఇంకా రావాల్సిన డబ్బులు చెల్లించాలని కోరారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఇస్తామన్న పరిహారం నాలుగు నెలలైనా నేటికీ ఇవ్వలేదన్నారు. ఇళ్లు కూలిపోయిన వారు మళ్లీ కట్టుకోవడానికి కలప కోసం అడవికి వెళ్తే ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నారని, వారి వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జెడ్‌పిటిసి వాళ్ళ రంగారెడ్డి, ఎంపిడిఓ, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.










