Aug 21,2023 22:38

అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ శ్రీకేశ్‌ లాఠకర్‌

* కలెక్టర్‌కు బూరవల్లి గ్రామస్తుల ఫిర్యాదు
* విచారణకు ఆదేశించిన శ్రీకేశ్‌ లాఠకర్‌
* స్పందనకు 265 అర్జీలు
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌: 
గార మండలం బూరవల్లి ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన నాడు-నేడు పనుల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, బిల్లుల చెల్లింపులో వ్యత్యాసం ఉందంటూ ఆ గ్రామ యువకులు జిల్లా కలెక్టర్‌ శ్రీకేశ్‌ లాఠకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపించినట్టు వివరించారు. నిధుల దుర్వినియోగంపై తక్షణమే విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని కలెక్టరు.. సమగ్రశిక్ష ఎపిసి రోణంకి జయప్రకాశ్‌ను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్తు సమావేశమందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు జాయంట్‌ కలెక్టర్‌ నవీన్‌, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌ వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 265 అర్జీలు అందాయి. వాటిలో కొన్ని.. శ్రీ జిల్లాలో 2012లో సోంపేట ప్రాంతంలో బీలభూముల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ పేరుతో ఎన్‌సిసి సంస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో 732 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారని పర్యావరణ పరిరక్షణ సమితి కార్యదర్శి బి.ఢిల్లీరావు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గత 13 ఏళ్లుగా ఒక్క కేసులో విముక్తి లభించడం లేదని, అంతకు ముందున్న 52 కేసులను న్యాయస్థానాలు కొట్టి వేశాయని వివరించారు. ఈ కేసు వల్ల 26 గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యువకులు ఉద్యోగాల్లో చేరాలన్నా, పాస్‌పోర్టు, నియామకాల సమయంలో వెరిఫికేషన్‌కు ఇబ్బందులు పడుతున్నామని కలెక్టరుకు వివరించారు. ప్రభుత్వానికి నివేదించి ఈ కేసు నుంచి 732 మందిని విముక్తులను చేయాలని కోరారు. ఆయనతోపాటు ఎం.నాగేశ్వరరావు, పలాసపురం గ్రామస్తులున్నారు. శ్రీ సారవకోట మండలంలోని పలు గిరిజన గ్రామాలకు రోడ్డు లేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఐటిడిఎ సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి బిటి రోడ్డులను మంజూరు చేయాలని పోలాకి జెడ్‌పిటిసి సభ్యులు ధర్మాన కృష్ణచైతన్య కలెక్టర్‌ను కోరారు. శ్రీ సారవకోట మండలం అసర్లసాగరంలో పూడికతీత చేపట్టక పోవడం వల్ల ఈ ఏడాది అరకొర వర్షాలకు నీరులేని దుస్థితి నెలకొందని, దీంతో నారుమళ్లు ఎండి పోతున్నాయని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని మదనాపురం సర్పంచ్‌ పి.స్వాతి కలెక్టర్‌ను కోరారు. శ్రీ ఎల్‌ఎన్‌పేట మండల కేంద్రంలో ఉన్న సమగ్ర రక్షిత మంచినీటి పథకం మరమ్మతులు చేపట్టాలని, వంశధార నదికి కరకట్టలను నిర్మించాలని వైసిపి పాతపట్నం నియోజకవర్గ నాయకులు సిరిపురపు తేజేశ్వరరావు కోరారు.
వినతుల సత్వర పరిష్కారం
ప్రజల నుంచి వివిధ మార్గాల్లో వస్తున్న వినతులను తక్షణమే పరిష్కరించి ఫిర్యాదుదారులకు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టరు శ్రీకేశ్‌ లాఠకర్‌ అధికారులను ఆదేశించారు. స్పందన అనంతరం అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా స్పందనతోపాటు 1902కు వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడంలో అలసత్వం వద్దన్నారు. ఎక్కడైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపిఒ రవికుమార్‌, సమగ్ర శిక్ష ఎపిసి జయప్రకాశ్‌, డిఇఒ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ చిట్టి రాజు, వంశధార ఎస్‌ఇ డోల తిరుమలరావు, డిఎంహెచ్‌ఒ మీనాక్షి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.