ఏజెన్సీలో ఎక్కడికక్కడే నిలిచిన నిర్మాణాలు
ప్రభుత్వపరంగా సిమెంట్ సరఫరాలో జాప్యం
అవసరమైన చర్యల్లో అధికారయంత్రాంగం విఫలం
ప్రజాశక్తి -పాడేరు: అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో ఇటీవల చేపట్టిన నాడు నేడు రెండవ విడత పనులకు ఇసుక, సిమెంట్ కొరత ఏర్పడింది. దీంతో వారం రోజులుగా పాడేరు మన్యంలో నాడు నేడు నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
పాడేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 284 విద్యాలయాలకు రెండోవిడత నాడు నేడు కింద రూ.63.37 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆయా విద్యాసంస్థల్లోని అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర నిర్మాణలతోపాటు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ మేరకు రెండు నెలల క్రితమే నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయితే ఈ నిర్మాణ పనులకు ప్రభుత్వమే సిమెంట్ సరఫరా చేస్తోంది. మరమ్మతు పనుల వరకు స్థానికంగా దొరికే ఇసుకను వినియోగిస్తున్నారు. అయితే స్లాబ్ నిర్మాణానికి, ప్లాస్టింగ్‌లకు మైదాన ప్రాంతాల నుంచి నాణ్యమైన ఇసుకను సేకరిస్తున్నారు.
అయితే పాడేరు ఏజెన్సీ ప్రాంతానికి ప్రభుత్వపరంగా సరఫరా చేస్తున్న సిమెంట్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక ఇసుక కొరత కూడా నిర్మాణ పనులపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వపరంగా ఒత్తిడి చేస్తున్న సంబంధిత అధికారులకు నిర్మాణాలకు అవసరమైన ముడిసరుకు సిమెంట్, ఇసుక, ఇంకా పిక్కఅందుబాటులో లేక పనులు నిలిచిపోయినా, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.ఒక కోటి 27 వేలు నిధులతో 'నాడు నేడు' రెండో విడతలో మరుగుదొడ్లు, ఫ్లాట్ ఫారాలు, తరగతు గదుల మరమ్మతులు వంటి పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులన్నీ సిమెంట్ కొరతతో నిలిచిపోయాయి. మరికొన్ని పనులు సిమెంట్ సరఫరాలో జాప్యం వల్ల మందకొడిగా సాగుతున్నాయి. సిమెంట్ సరఫరాలో ఏర్పడిన జాప్యంపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి సకాలంలో సిమెంట్ సరఫరా చేయించి పనులు వేగవంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని పాఠశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి.










