Feb 20,2023 23:46

అధ్వానంగా ఉన్న రాత్రుల పుట్టు పాఠశాల.

బిల్లులు చెల్లించక నాలుగు నెలలుగా నిలిచిన నిర్మాణాలు
అర్థాంతరంగా ఆగిన పనులతో కొత్త అవస్థలు
ప్రజాశక్తి -హుకుంపేట
:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'నాడు నేడు' పనులకు నిధుల గండం వెంటాడుతోంది. రెండో విడతలో మంజూరైన పలు పాఠశాలల్లోని అభివృద్ధి పనులు నాలుగు నెలలుగా నిలిచిపోయాయి. అర్థాంతరంగా ఆగిన పనులతో ఉర్రాడ బొడ్డపుట్టు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆరు బయట విద్యాబోధనతో ఒకటో తరగతి విద్యార్థి తూబురు ధన్విత ప్రాణాలను బలిగొనగా, అనేక చోట్ల నానా అవస్థలు పడుతున్నారు. నిధుల కొరతతో బిల్లులు చెల్లించకపోవడం వల్లే పనులు నిలిచిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
2020-21లోనాడు నేడు పథకంలో మొదటివిడతగా మంజూరైన నిధులతో మండలంలో 27పాఠశాలలు సుందరంగా అభివృద్ధి చేశారు. రెండో విడతలో 50 పాఠశాలలను గుర్తించగా, ఆయా పాఠశాలల్లో మంజూరైన నిధులతో మొదట్లో చురుగ్గానే పనులు సాగినప్పటికీ, నాలుగు నెలలుగా హఠాత్తుగా నిలిచిపోయాయి. దీంతో అర్థాంతరంగా నిలిచిన పనులు ఇపుడు కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి.
పాఠశాలల్లో పనులు జరుగుతుండడంతో ప్రత్యామ్నాయంగా ఆరుబయటో, ఇంకొకచోట పాఠశాలలను నిర్వహించాల్సిన దుస్థితిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే క్రమంలో నాడునేడు పనులు జరుగుతున్న ఉర్రాడ బొడ్డపుట్టు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆరు బయట తరగతులు నిర్వహిస్తుండగా, విద్యుత్‌స్తంభం పడడంతో తూబురు ధన్విత అనే ఒకటో తరగతి విద్యార్థిని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కరకపుట్టు ఎంపిపి పాఠశాల పనులు సగంలోనే నిలిచిపోవడంతో చర్చిలోకి పాఠశాలను మార్చాల్సిన దుస్థితి దాపురించించి. మిగిలిన పాఠశాలల్లో దాదాపు ఇలాంటి సమస్యలతోనే ఇబ్బందులు పడుతున్నారు.
నాడునేడు పనులతో పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందుతాయని ఆశించిన తల్లిదండ్రులు, ఇపుడు సగంలోనే నిలిచిన పనులతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై సంబంధిత ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ఇతర అధికారులను ప్రశ్నిస్తే, నిధులు విడుదల కాక బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో పనులు నిలిచిపోయాయని చెప్పడంతో ఆందోళన వ్యక్తమౌతోంది. పాత భవనాలు లేక, కొత్త భవనాలు పూర్తికాక ఎటూ కొరగాని విధంగా నాడునేడు పనులు ఉన్న వసతిని లేకుండా చేసేశాయని పలువురు ఆరోపిస్తున్నారు. అనేక పాఠశాలలకు కిటికీలు తలుపులు లేకుండా సగంలోనే ఉండిపోగా, కొన్ని పాఠశాలకు మరమ్మతుల కోసం శ్లాబులు, గోడల పెచ్చులను ఊడగొట్టి, వాటికి ప్లాస్టింగ్‌లు చేయకుండా వదిలేశారు. శ్లాబు, లింటల్‌ లెవెల్‌ వరకు కొన్ని చోట్ల పనులు జరిగాయి, దాదాపు అన్ని పాఠశాలల్లోనూ అరకొర పనులతో కొత్త సమస్యలు సృష్టించిన ప్రభుత్వం, వెంటనే నిధులను మంజూరు చేసి పాఠశాలల్లో నాడునేడు పనులను పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు కోరుతున్నారు.