Aug 29,2023 20:36

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు

 కడప అర్బన్‌ బడి ఈడు ఉన్న ప్రతి చిన్నారినీ పాఠశాలలో చేర్పించి, చైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదు చేయాలని, పెండింగ్‌లో ఉన్న నాడు-నుడు పనులను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ స్పందన హాలులో అన్ని పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల ఆరోగ్యం, మనబడి 'నాడు నేడు' ఫేస్‌-2 పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ దశ నాడు-నేడు పనులకు సంబంధించి అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే దాదాపు పూర్తి చేశామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పేరెంట్స్‌ కమిటీ అకౌంట్లలో నిధులు కూడా సమృద్ధిగా ఉన్నాయని సంబందిత నిధులను వెచ్చించి ఆయా పాఠశాలల్లో అన్ని రకాల అభివద్ధి పనులను పెండింగ్‌ లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. మండల ఇంజినీరింగ్‌ అధికారులు, ఎంఇఒలు ప్రతిరోజు 5 పాఠశాలలను పర్యవేక్షణ చేయాలన్నారు. అలాగే సీడీపీవోలు కూడా వారింపరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో నాడు నేడు ద్వారా అభివద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దష్టి సారించాల్సిన నైతిక బాధ్యత ఎంఇఒలదే అని సూచించారు. పిహెచ్‌సి వైద్యుల ద్వారా ప్రతి విద్యార్థికి వైద్య పరీక్షలు చేయించాలని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా పిల్లల్లో పౌష్టికాహార లోపాలు కనిపించకుండా విద్యాశాఖ అధికారులు వైద్యాధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబందిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఇఒ రాఘవరెడ్డి, సమగ్ర శిక్ష పివో డాక్టర్‌ అంబవరం ప్రభాకర్‌ రెడ్డి, ఐసీడీఎస్‌ పీడి శ్రీలక్ష్మి, విద్యాశాఖ, ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీ ఇంజినీరింగ్‌ పంచాయతీరాజ్‌, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ, ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌, మండల ఇంజనీర్లు, మండల విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష సెక్టోరల్‌ అధికారులు పాల్గొన్నారు.