May 23,2023 19:51

నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సారథ్యంలోని ఎపి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేసింది. పాఠశాలలను కొత్తగా మార్చేసింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి. పాఠశాలలు కొత్త వెలుగులు నింపుకుంటున్నాయి. పాఠశాలల్లో డ్రాపౌట్‌ రేటును తగ్గించాలని ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
మండలంలోని బల్లేకల్‌ గ్రామంలో గత కొన్నేళ్లుగా ఎంపియుపి పాఠశాలగా కొనసాగి 2017లో ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ అయింది. పాఠశాల స్థాయిని పెంచారు కానీ, వసతులు మరిచారు. 3 నుంచి 10వ తరగతి వరకు 275 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 3 తరగతి గదులతో, 8 మంది ఉపాధ్యాయులతో విద్యార్థులకు విద్యను ఆరుబయట, చెట్ల కింద విద్యార్థులకు విద్యను అందించేవారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పథకం ద్వారా రెండో విడత కింద సుమారు రూ.80 లక్షలతో 12 తరగతి గదులు, కిచెన్‌ షెడ్‌, టాయిలెట్స్‌, విద్యార్థులకు ఆట స్థలం నిర్మాణం చేపట్టారు. అందుకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.చంద్రశేఖర్‌ చొరవ తీసుకొని, మండల స్థాయి విద్యాశాఖ అధికారులు, సర్పంచి లోకేష్‌, గ్రామ సచివాలయం సిబ్బంది, పేరెంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రభాకర్‌, గ్రామస్తుల సహకారంతో నాడు-నేడు పనులు చకచకా సాగుతున్నాయి. గతంలో ఈ పాఠశాలలో విద్యనభ్యసించాలంటే సరైన తరగతి గదులు లేకపోవడం, మౌలిక వసతులు లేకపోవడంతో గ్రామానికి చెందిన విద్యార్థులు విద్యను మధ్యలో ఆపేసేవారని గ్రామస్తులు తెలిపారు. 2017లో ప్రధానోపాధ్యాయులుగా డి.చంద్రశేఖర్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యార్థులకు నచ్చిన విధంగా పాఠాలు చెబుతూ, తోటి ఉపాధ్యాయులతో, గ్రామస్తుల సహాయ, సహకారాలతో, పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు ద్వారా పాఠశాల నిర్మాణం జరుగుతోంది. ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లతో విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నీచర్‌, పాఠశాలకు రంగులు, ఆకుపచ్చ సుద్ద బోర్డులు, ఇంగ్లీష్‌ ల్యాబ్స్‌, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాలు జరుగుతున్నాయని, విద్యార్థులకు మౌలిక వసతులు, మంచి విద్యనందించేందుకు కృషి చేస్తామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
గతంలో ఎన్నో ఇబ్బందులు
- డి.చంద్రశేఖర్‌, ప్రధానోపాధ్యాయులు, జడ్‌పి హైస్కూల్‌, బల్లేకల్‌

గతంలో ఎన్నో ఇబ్బందులతో విద్యార్థులకు విద్యను బోధించాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పనుల ద్వారా విద్యార్థులకు మంచి విద్యనందించేందుకు కృషి చేస్తాం. అన్ని అనుకూలిస్తే ఆగస్టు 15లోపు నూతన పాఠశాల భవనంలో జెండా ఎగరేసేందుకు సిద్ధమవుతున్నాం. గ్రామస్తులు, అధికారులు, పేరెంట్స్‌ కమిటీ సభ్యుల సహకారంతో నూతన పాఠశాలను ప్రారంభించుకుంటాం. ఇక పదో తరగతి విషయానికొస్తే కె.గంగోత్రి 476, వాణి 470, కె.మల్లికార్జున 470 మార్కులు సాధించారు. పాఠశాలలో మొత్తం 67 శాతం ఉత్తీర్ణత నమోదయింది.