Feb 25,2023 19:41

తరగతి గదిలో ఇద్దరే ఉన్న పిల్లలు

 

పాఠశాల భవనం
పాఠశాల భవనం

నాడు కళకళ.. నేడు వెలవెల
- రెండు తరగతులకు ఇద్దరే పిల్లలు
- విద్యా బోధనకు ఒక్క ఉపాధ్యాయుడు
ప్రజాశక్తి - రుద్రవరం

 విద్యా విధానంలో నూతన మార్పులు రాక ముందు గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతుండేవి. ఇటీవల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి కళావిహీనంగా మారి వెలవెలబోతున్నాయి. 3,4,5 తరతులను ఉన్నత పాఠశాలలోకి విలీనం చేయడంతో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. రుద్రవరం మండలం తుమ్మల కొట్టాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నూతన విద్యావిధానం అమలు చేయకముందు 1 నుంచి 5వ తరగతి వరకూ విద్యా బోధన జరుగుతుండేది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు దాదాపు బాల బాలికలు 14 మంది విద్యనభ్యసిస్తుండేవారు. నాడు బాల బాలికలతో పాఠశాలలోని తరగతి గదులు, ఆవరణం కళకళాలాడుతుండేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన నూతన విద్యా విధానం తర్వాత తుమ్మలకొట్టాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లావత్తుల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీంతో 3,4,5వ తరగతుల విద్యార్థులు 12 మంది ప్రతి రోజూ 2 రెండు కిలోమీటర్లు దూరం నడుచుకుంటూ ఎల్లావత్తుల గ్రామానికి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పాఠశాలలో 1,2 తరగతులకు ఇద్దరు మాత్రమే చదువుకుంటున్నారు. వీరికి ఒక ఉపాధ్యాయుడు విద్యాబోధన చేస్తున్నారు. నూతన విద్య విధానం నిబంధనల ప్రకారం పాఠశాలలో 10 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉంటే ఆ పాఠశాలలను మూసివేయనుండడంతో నేడు తుమ్మలకొట్టాల ప్రాథమిక పాఠశాలకు తాళం తప్పదేమోనని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.