Aug 24,2023 20:48

జన్మభూమి పార్కు వద్ద కొరవడిన పర్యవేక్షణ
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వైనంహొ
పట్టించుకోని అధికారులు, నాయకులు
ప్రజాశక్తి - ఉండి
నిత్యం సందర్శకులతో ఉండే ఉండి జన్మభూమి పార్కు నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అధికారులు, నాయకుల పర్యవేక్షణ కొరవడడంతో రాత్రి సమయంలోనే కాకుండా పట్టపగలే మందుబాబులు రెచ్చిపోతున్నారు. దీంతో పార్కులో ఎక్కడ చూసినా ఖాళీ మద్యం సీసాలు, సిగరెట్‌ ప్యాకులు, తాగి పడేసిన గ్లాసులు దర్శనమిస్తున్నాయి. దీంతో పార్కులోకి వచ్చేందుకు సందర్శకులకు ఇబ్బందికరంగా మారింది. పల్లె ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని అందించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా 2016వ సంవత్సరంలో అప్పటి ఉండి శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు ఆధ్వర్యంలో హొఉండిలో జన్మభూమి పార్కును అభివృద్ధి చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రెండోసారి ఎంఎల్‌ఎగా గెలిచిన తర్వాత శివరామరాజు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఉండి పార్కును ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పార్కులో సర్‌ ఆర్థర్‌ కాటన్‌ విగ్రహం, ఫలాహార శాల, చిన్నారులకు క్రీడా సామగ్రి, వృద్ధులు నడిచేందుకు వాకింగ్‌ ట్రాక్‌ వంటివి ఏర్పాటు చేశారు. సందర్శకులకు సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దారు. ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు అధికారులు పార్కు ఆలనా పాలనా పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. జన్మభూమి పార్కు నిర్వహణ బాధ్యతలు చూసే నాధుడే లేడని, దీంతో ఎక్కడ చూసినా పెరిగిపోయిన చెట్లు, పుట్టలు, పొదలతో పార్కు దర్శనమిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్కులోని కాటన్‌ విగ్రహం చెద పుట్టలతో నిండిపోయి ఉండడం ఆవేదన కలిగిస్తోందని చెబుతున్నారు. పార్కులోని క్రీడా సామగ్రి పూర్తిగా చెడిపోయి చిన్నారులు ఆడుకునేందుకు వీలు లేకుండా ఉండటంతో చిన్నారుల సైతం ఇటువైపుగా కన్నెత్తి చూడడం లేదు. 165వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ జన్మభూమి పార్కును అభివృద్ధి చేసి తిరిగి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని, మందుబాబుల నుంచి పార్కును రక్షించాలని ప్రకృతి ప్రేమికులు, ప్రజలు కోరుకుంటున్నారు.