
ప్రజాశక్తి ముదిగుబ్బ : స్థానిక సొసైటీ ఆర్థిక అభివృద్ధి, రైతుల ఉత్పత్తులు విక్రయించుకోవడానికి నిర్మించిన నాబార్డ్ రైతు గ్రామీణ సంత (రూరల్ హట్) కుటీరాలను సద్వినియోగం అయ్యేలా వినియోగంలోకి తీసుకురావాలని ఎడిసిసి బ్యాంక్ చైర్‌పర్సన్ లిఖిత, స్థానిక సొసైటీ అధ్యక్షులు బయపరెడ్డికి సూచించారు. ఏడీసీసీ చైర్మన్ లిఖిత స్థానిక ఎడిసిసి బ్యాంకును, సొసైటీని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ఆవరణలో నిర్మించిన రూరల్ హట్లను పరిశీలించారు. రైతులు పండించిన తమ ఉత్పత్తులను దళారులతో ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించుకొని లబ్ధి పొందడానికి, సొసైటీ ఆర్థిక స్వయం సమృద్ధి ఆదాయ కల్పన పొందడానికి మూడు సంవత్సరాల క్రితం రూ. 16.50 లక్షల నాబర్డ్ నిధులతో సొసైటీ ఆవరణలో 24 రూరల్ హట్‌లను నిర్మించారన్నారు. అయితే వాటిని నేటికీ వినియోగించకపోవడంతో సొసైటీకి, రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకునేలా వినియోగం లోకి తీసుకురావాలని సొసైటీ చైర్మన్ బయపరెడ్డికి సూచించారు. అలాగే గతంలో నాబార్డ్ నిధులతో మంజూరైన పెట్రోల్ బంకు నిర్మాణం ప్రగతిని, నిర్మాణం గురించి ఆరా తీశారు. పట్టణ నడిబొడ్డున అత్యంత విలువైన విశాలమైన స్థలంలో సొసైటీ ఆర్థిక అభివృద్ధికి వినియోగపడేలా వ్యాపార సముదాయ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి తమకు అందజేస్తే వాటికి అనుమతులు, నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీసీసీ జనరల్ మేనేజర్ సురేఖ రాణి, ఆప్కాబ్ డిపిడిఎం తేజస్విని, స్థానిక ఎడిసిసి బ్యాంక్ మేనేజర్ వెంకటరమణమ్మ, సహాయక మేనేజర్ కీర్తి సాగర్, బ్యాంకు సిబ్బంది, సొసైటీ సీఈవో శ్రీనివాసులు, వైకుంఠరెడ్డి, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.