Nov 17,2022 00:05

శంకస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి- కొత్తకోట:మేజర్‌ పంచాయతీ కొత్తకోటతో పాటు సుమారు మరో 20 గ్రామాల ప్రజలకు కనీస అవసరాలతో కూడిన రైతు బజార్‌ దుకాణ సముదాయాన్ని నాబార్డ్‌ నిధులతో సమకూరుస్త్తున్నట్టు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. బుధవారం కొత్తకోటలో నాబార్డ్‌ ఏజీఎం ఎస్‌.శ్రీనివాసరావుతో కలిసి దుకాణ సముదాయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రాంతాల వలే గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైతు బజార్‌ ఏర్పాట్లకు చర్యలు చేపడుతున్నట్లు ధర్మశ్రీ తెలిపారు. కనుమరుగవుతున్న వారపు సంతులను అభివృద్ధి చేసి రైతులతో పాటు వినియోగదారులకు సదుపాయాలతో కూడిన మార్కెట్‌ యార్డ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. సుమారు రూ.15 లక్షల నా బార్డు నిధులతో రెండు షెడ్డులను నిర్మించి 40 దుకాణ సముదాయం కల్పిస్తామని పెన్సింగ్‌, సోలార్‌ లైట్లు, గేట్‌ తదితర సదుపాయాలు ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో, మెయిన్‌ రోడ్‌లో ట్రాఫిక్‌ సమస్య తీరడంతో పాటు ఆరోగ్యకరమైన సరుకులు కొనుగోలు చేసుకునే అవకాశం వినియోగదారులు కలుగుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
నాబార్డ్‌ ఏజీఎం శ్రీనివాస రావు మాట్లాడుతూ, జిల్లాలో మేజర్‌ పంచాయతీలకు సుమారు రూ.15 లక్షలు నిధులు మంజూరు చేసి మరో మూడున్నర లక్షలు పంచాయతీ మ్యాచింగ్‌ గ్రాంటుతో మార్కెట్‌ యార్డులలో దుకాణ సముదాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ కోన లోవరాజు, పందల దేవా, వైఎస్‌ఆర్‌ సిపి జిల్లా తలారి ఆదిమూర్తి, మండల కార్యదర్శి శీలం శంకర్రావు, ఎంపీటీసీ పూడి దేవా, కె.శంకర్రావు, పైల దాసు, కార్యదర్శి కృష్ణ మోహన్‌, ఉమా, పలువురు వార్డు సభ్యలు పాల్గొన్నారు.