Jan 12,2022 17:12

న్యూఢిల్లీ :  తన నిర్ణయం బిజెపిలో ప్రకంపనలను సృష్టించిందని ఒబిసి కీలక నేత స్వామి ప్రసాద్‌ మౌర్య పేర్కొన్నారు. మంత్రి పదవికి స్వామి ప్రసాద్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే నలుగురు ఎమ్మెల్యేలు రోషన్‌లాల్‌ వర్మ, బ్రిజేష్‌ ప్రజాపతి, భగ్వతి సాగర్‌, వినరు షక్యాలు కూడా పార్టీని వీడుతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్వామి ప్రసాద్‌ మాట్లాడుతూ.. తన నిర్ణయం బిజెపిలో భూకంపం సృష్టించిందని అన్నారు. తాను కేవలం మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశానని, త్వరలో పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని, అయితే సమాజ్‌వాది పార్టీలో చేరలేదని అన్నారు. తన నిర్ణయమేమిటనేది శుక్రవారం ప్రకటిస్తానని ట్విస్ట్‌ ఇచ్చారు. బిజెపికి గుడ్‌బై చెప్పానని, వెనక్కివెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమాజ్‌వాది పార్టీలో ఈ నెల 14న చేరనున్నానని, తనకు ఆ పార్టీ నేతలెవరి నుండి ఫోన్‌కాల్స్‌ రాలేదని అన్నారు. తనను అఖిలేష్‌ యాదవ్‌ అభినందించడం వాస్తవమేనని చెప్పారు. తన మద్దతుదారులతో సమావేశమైన అనంతరం తదుపరి రాజకీయ ఎత్తుగడను వెల్లడిస్తానని.. అలాగే తనకు మద్దతు తెలిపే వారి వివరాలను కూడా ప్రకటిస్తానని అన్నారు. కాగా, ఒబిసి నేతల వలసలతో కంగుతిన్న బిజెపి నాయకత్వం రెబల్స్‌ను బుజ్జగించేందుకు డిప్యూటీ సిఎం కేశవ ప్రసాద్‌ మౌర్యని రంగంలోకి దించింది. కేశవ ప్రసాద్‌ మౌర్య బిజెపి కీలక ఒబిసి నేతలలో ఒకరు. యుపి ఎన్నికలలో యాదవ్‌ యేతర ఒబిసి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అఖిలేష్‌ యాదవ్‌కి కౌంటర్‌గా ఎన్నికల బరిలో బిజెపి దింపనుంది. అయితే మౌర్యకి, యోగికి మధ్య కూడా విబేధాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని, రెండు నెలల క్రితం యోగిపై ఫిర్యాదు చేసేందుకు అమిత్‌షాతో సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ పార్టీ యోగిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆవర్గాలు పేర్కొన్నాయి. స్వామి ప్రసాద్‌, ఆయన మద్దతుదారులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌యాదవ్‌ ట్వీట్‌ చేయడంతో పాటు ఆయనతో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.