ప్రజాశక్తి బాపట్ల : బాపట్ల జిల్లా ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సభలో సభలో తాను చేసిన ప్రసంగాన్ని కొందరు వక్రీకరించినట్లు ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసే విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 4న జిల్లా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బాపట్ల తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో తాను మాట్లాడిన మాటలు కొంతమందికి కంటగింపుగా, ఇబ్బందికరంగా ఉందేమో తనకు తెలియదని తెలిపారు. అయితే కొందరు తన మాటల్లో పదాల్ని వక్రీకరిస్తూ ఎస్‌సి సామాజిక వర్గానికి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని రిజర్వేషన్ చేసే విషయంపై తనకు వేరే అభిప్రాయం ఉందని చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఆ ప్రయత్నం దురదృష్టకరమని తెలిపారు. ఒక పదానికి అనేక అర్ధాలు ఉంటాయని తెలిపారు. బాపట్ల జిల్లా ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తాను ఓ రాజకీయ పార్టీని ఉటంకిస్తూ మాట్లాడినట్లు తెలిపారు. 1977లో బాపట్ల పార్లమెంట్ స్థానం ఏర్పాటు అయినట్లు తెలిపారు. అప్పట్లో జేడీ శీలం లేరని తెలిపారు. జేడీ శీలం కోసం ఎస్‌సి రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉన్న నెల్లూరు నియోజకవర్గ రిజర్వేషన్ తొలగించి బాపట్ల పార్లమెంట్‌ను ఎస్‌సి నియోజక వర్గంగా మార్పు చేసినట్లు తెలిపారు. ఆ నిర్ణయం వల్ల శీలంకు లబ్ధి జరిగిందేమో గాని బాపట్ల జిల్లాకు లబ్ధి జరగలేదని తెలిపారు. అప్పట్లో ఇదే నియోజకవర్గంలోని పొన్నూరును పొగొట్టుకున్నట్లు తెలిపారు. కలుపుకున్న సంతనూతలపాడును నిలబెట్టుకోలేక పోయాని తెలిపారు. ఆ రెండు నియోజకవర్గాలు ఉంటే జిల్లా ఆర్థిక పరిస్థితి బాగుండేది అనేదే తన ఉద్దేశ్యమని తెలిపారు. తన మాటలు ఎవరిరైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నట్లు తెలిపారు. అనంతరం నా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కోకి రాఘవరెడ్డి, యెజ్రయ్య, చేజర్ల నారాయణరెడ్డి, ఇనగలూరి మాల్యాద్రి, వడ్డిముక్కల డేవిడ్, పిల్లి శేఖర్, దొంతిబోయిన సీతారామిరెడ్డి, పీటా బాబు, మూల పాలెం సర్పంచి, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










