Sep 01,2023 22:28

అసుపత్రిలోని మాత శిశు విభాగం

ప్రజాశక్తి-హిందూపురం : సుఖ ప్రసవాలకు ప్రభుత్వ అసుపత్రికి రావాలని...ప్రభుత్వ అసుపత్రిలో నాడు-నేడు కింద అన్ని సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు. ఇది చాలదన్నట్లు ఆశా, అంగన్వాడీ వర్కర్లతో పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. ఇలాంటి ఘటన హిందూపురం జిల్లా ప్రభుత్వ అసుపత్రిలో నెలకొంది. ఈఘటనకు సంబందించి బాధితులు తెలిపిన వివరాలు...
హిందూపురం మండలం సంతేబిదనూరు గ్రామానికి చెందిన తులసి అనే మహిళను కర్నాటక రాష్ట్రం గౌరిబిదనూరు తాలుకు వాటంకొత్తపల్లికి చెందిన రాజు ఇచ్చి వివాహం జరిపించారు. తులసి ప్రస్తుతం సంతే బిదనూరు గ్రామంలో వాలంటీర్‌ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె రెండవ సారి గర్భం దాల్చింది. వైద్యపరీక్షల నిమిత్తం రెండురోజుల క్రితం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. వైద్య పరీక్షలు చేసిన వైద్యురాలు నీరజ మరో నాలుగు రోజుల్లో తులసికి కాన్పు అవుతుందని చెప్పింది. దీంతో వారు గ్రామానికి వెళ్లారు. అయితే శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో ఆశావర్కర్‌ జయమ్మ సాయంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అయితే వైద్యురాలు నీరజ విధుల్లో లేక పోవడంతో విధుల్లో ఉన్న మరో వైద్యురాలు నాగసింధును సంప్రదించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యురాలు ఇక్కడ వైద్య సేవలను అందించలేనని తన సొంత క్లినిక్‌కు వస్తే ఆపరేషన్‌ చేస్తానని చెప్పింది. ఆపరేషన్‌కు రూ.30వేలు, ఇతర పరీక్షలకు అదనంగా ఖర్చు అవుతుందని తెలిపింది. దీంతో తులసి కుటుంబసభ్యులు తమ వద్ద అంతడబ్బు లేదని ఇక్కడే కాన్పుచేయాలని ఆ వైద్యురాలిని కోరారు. అందుకు ఆమె ససేమిరా అంది. వస్తే తన సొంత క్లినిక్‌కు రావాలని లేకుంటే అనంతపురం రెఫర్‌ చేస్తానని ఖరాఖండిగా చెప్పింది. దీంతో బాధితులు కర్నాటక రాష్ట్రం గౌరిబిదనూరుకు వెళ్లి, అక్కడి నుంచి చిక్కబళ్లాపురం వెళ్లారు. ఈ విషయంపై తులసి భర్త రాజు మాట్లాడుతు తాను బేల్దారు పని చేసుకుని జీవనం చేస్తున్నానని డబ్బే ఉంటే బెంగళూరుకు తీసుకెళ్లి వైద్యం అందించే వాడిని అన్నారు. డబ్బుల కోసం ప్రభుత్వ అసుపత్రిలో ఇలా వేధిస్తారని అనుకోలేదని అన్నారు.
రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
బాధితులు వారికి జరిగిన అన్యాయంపై స్పందించి రాత పూర్వకంగా ఫిర్యాదు రాసి ఇస్తే విచారణ చేసి వైద్యురాలిపై చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు చేయకుంటే ఏమి చేయలేం. అయినప్పటికి ఈ విషయంపై విచారణ జరిపిస్తాం.
డాక్టర్‌ రోహిల్‌,
ఆసుపత్రి సూపరింటెంటెండ్‌