ప్రజాశక్తి - టి.నరసాపురం
'నా భూమి - నా దేశం' కార్యక్రమం ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించవచ్చని కేతవరం గ్రామపంచాయతీ సర్పంచి తడికలపూడి శివ మాధవి కిషోర్ తెలిపారు. 'నా భూమి - నా దేశం', నేల తల్లికి నమస్కారం, వీరులకు వందనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక మావుళ్ళ చెరువు వద్ద స్వాతంత్య్ర సమర యేధుల పేర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసి అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరులు, స్వాతంత్య్ర సమర యోథులను స్మరించుకొని, దేశం కోసం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. యువత దేశాభివృద్ధికి నడుము బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బొడ్డపాటి రాంబాబు, తడికలపూడి శివానంద శర్మ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.










