ప్రజాశక్తి - భీమడోలు
రాష్ట్రంలో 'నా భూమి నా దేశం' పేర నిర్వహిస్తున్న కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కోరారు. భీమడోలు మండలం సూరప్పగూడెంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన 'నా భూమి నా దేశం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి సత్కరించారు. స్థానిక అమరవీరుల పేర్లు గల శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల సంస్మరణార్థం మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ప్రారంభమైన ఆజాద్‌కి అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత సంవత్సరం నా భూమి నా దేశం కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు ఆగస్టు 15వ తేదీ వరకూ కొనసాగుతాయన్నారు. ప్రతీ గ్రామంలో అమరవీరుల పేర్లు రాసిన శిలాఫలకాల ఆవిష్కరణ, వారికి గుర్తుగా మొక్కలు నాటడం, పంచ ప్రాణ ప్రతిజ్ఞ లు చేయించడం వంటి కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఒ రవికుమార్, భీమడోలు ఎంపిడిఒ పద్మావతి దేవి, తహశీల్దార్ ఇందిరా గాంధీ, పంచాయతీ విస్తరణాధికారి ముత్తయ్య, డిప్యూటీ తాహశీల్దార్ షంషుద్దీన్‌తో పాల్గొన్నారు.










