ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన ధనరాజు
రెండు కాళ్లు, చెయ్యి విరిగిన వైనం
వైద్యం కోసం అర్ధిస్తున్న భార్య
ప్రజాశక్తి- కొత్తపేట
పిల్లల కేరింతల మధ్య సాఫీగా సాగుతున్న ఆ చిన్నకుటుంబంలో రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఇంటి యజమాని జీవచ్ఛవంగా మంచానికే పరిమితమవ్వడంతో కుటుంబ రోడ్డున పడింది. కనీసం వైద్యం కూడా అరదించలేని స్థితిలో భార్య నానా కష్టాలు పడుతోంది. చిన్నారులకు అన్నం కూడా పెట్టలేక కన్నీటి పర్యంతమవుతోంది. ఆపన్నుల సాయం కోసం చేతులు జోడించి అర్ధిస్తోంది.
కొత్తపేట మండలం గంటి గ్రామానికి చెందిన గుత్తుల ధనరాజు, లక్ష్మి భార్యా భర్తలు. వీరికి పదేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. ధనరాజు వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంత వరకూ వారి జీవనం సాఫీగానే సాగింది. ఇటీవల గంటి ఈతకోట రహదారిలో ధనరాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో రెండు కాళ్లు, ఒక చెయ్యి విరిగిపోయింది. ఎడమ చేయి మణికట్టు విరిగి ఎముక బయటకు వచ్చేసింది. రెండు కాళ్లకు నాలుగు చోట్ల ఎముకలు విరిగాయి. దీంతో భర్త వైద్యం కోసం లక్ష్మి అయినకాడికి అప్పులు చేసింది. ఇప్పటి వరకు ఐదు చోట్ల ధనరాజుకు శస్త్రచికిత్సలు చేశారు. మరో రెండు శస్త్రచికిత్సలు చేయాలని వైద్యులు సూచించారు. దీని నిమిత్తం రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఈ సర్జరీలు చేయించేందుకు పైసా కూడా లేకపో వడంతో లక్ష్మి కన్నీటిపర్యంత మవుతోంది. తన బంధువుల పరిస్థితి కూడా అంతంత మాత్రమేనని వాపోయింది. తనకు ఆరోగ్యం బాగోదని ఇంటి వద్దనే ఉంటానని చెబుతోంది. అనారోగ్యం కారణంగా ఏ పనికీ వెళ్లలేక, భర్తకు వైద్యం చేయించలేక కన్నీరుమున్నీరవుతోంది. తన భర్త వైద్యం కోసం దాతలు సహకరించి ఆదుకోవాలని చేతులు జోడించి అడుగుతోంది. తనకు సాయం అందించాలనుకునేవారు గుత్తాల లక్ష్మి (9666885901) నెంబర్‌ను సంప్రదించాలని కోరుతోంది. దాతలకు కనికరించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటోంది.










