Aug 03,2021 21:32
తూము వద్ద గట్టుపై వీరరాఘవులు మృతదేహం

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్‌ : పశ్చిమగోదావరి జిల్లాలో అగ్రవర్ణానికి చెందిన అన్నదమ్ములు ఘాతుకానికి పాల్పడ్డారు. దళిత రైతును దారుణంగా హత్య చేశారు. పొలం వద్ద నీటి విషయంలో తగాదా పడి ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదవేగి మండలం ముండూరుకు చెందిన దళిత రైతు భీమడోలు వీరరాఘవులు ముండూరు కన్నసముద్రం దగ్గర బురద తూము ఆయకట్టు కింద ఉన్న పొలానికి నీళ్లు పెట్టడానికి మంగళవారం సాయంత్రం వెళ్లాడు. అదే సమయంలో కొప్పులవారిగూడేనికి చెందిన అన్నదమ్ములు ఆరుమళ్ల వల్లీరావు, గోపాలం ఇక్కడికి అతి దగ్గరలో ఉన్న తమ వరి పంటకు నీళ్లు పెట్టేందుకు వచ్చారు. తామే ముందుగా నీరు పెట్టుకుంటామంటూ వీరరాఘవులుతో వీరిద్దరూ వాగ్వివాదానికి దిగారు. కర్రలతో కొట్టి దళిత రైతును హత్య చేశారు. ఏలూరు రూరల్‌ సిఐ అనసూరి శ్రీనివాసరావు, పెదవేగి ఎస్‌ఐ సుధీర్‌ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

సిపిఎం, కెవిపిఎస్‌ ఖండన
వీరరాఘవులును హత్య చేయడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కె.రవీంద్ర తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, దళిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.