Jan 02,2023 16:40

ప్రజాశక్తి-విఆర్ పురం : ఐదు సంవత్సరాలుగా రసాయనిక ఎరువులు కెమికల్స్ తో కూడిన మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ పెట్టుబడి తగ్గించి మంచి లాభదాయకంగా మిర్చి టమాట బెండ వరి మొదలైన పంటలు పండిస్తున్న విఆర్ పురం మండలం చొక్కానపల్లి గ్రామానికి చెందిన తోడం రాజు యొక్క పొలాన్ని మండల ఎంపీపీ కారం లక్ష్మి సోమవారం నాడు సందర్శించారు. దీని వలన భూమి సారవంతమైనదిగ ఉంటుందని, భావితరాల వారికి ఉపయోగపడుతుందని మరియు వివిధ వ్యాధులకు మనిషి దూరం అవ్వచ్చని ఎంపీపీ తెలిపారు. రసాయనిక ఎరువులు వాడి పండించిన కూరగాయలు ధాన్యం మిర్చి తినడం వలన అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంట మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు. ఆవు పేడ, మూత్రం మరియు పుట్ట మట్టి అడవిలో దొరికే వివిధ ఆకుల ను సేకరించి పంటలో వచ్చే పురుగులను తగ్గించే మరియు ముడత లాంటి వాటికి నీమాస్త్రం అజ్ఞాస్త్రం లాంటి మందులు తయారుచేస్తూ, పంటపై పిచికారి చేయడంవలన మనం పండించే పంటలలో పెట్టుబడిని తగ్గించవచ్చని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఎక్కువ లాభం పొందే అవకాశం ఉందని ఆమె తెలిపారు. రైతు సహాయక వేదిక నుంచి భూమిపుత్ర పురష్కారాన్ని, ప్రశంసాపత్రాన్ని అందుకున్న రాజును ఎంపిపి అభినందించారు. ఒకపక్క ఆర్థికంగా వెనుకబడిన గిరిజన కుటుంబంలో పుట్టి ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచే తోడం రాజుకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం చేస్తే ఇంకా కొంతమంది రైతులని ప్రకృతి వ్యవసాయం చేయించవచ్చని, తక్షణమే జిల్లా కలెక్టర్ వారు ఐటిడిఏ చింతూరు పిఓ వారు ఆర్థికంగా రాజు చేస్తున్న ప్రకృతి వ్యవసాయానికి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ పర్యటనలో శ్రీరామగిరి సర్పంచ్  పులి సంతోష్ కుమార్, చిన్నమటపల్లి ఎంపీటీసీ పూణెం ప్రదీప్ కుమార్, రైతు సంఘం నాయకులు సోయం చినబాబు, పంకు సత్తిబాబు, పొడియం శ్రీరామ్ మూర్తి, గుండె పూడి లక్ష్మణరావు, ఆత్మకూరు కాంతారావు, తుమ్మలపల్లి.నాగేశ్వరరావు,  నాళ్లరపు.చందర్రావు, నేర్రిబోయిన.రాజు, సున్నం శ్రీను తదితరులు ఉన్నారు.