Jul 28,2023 15:51

ప్రజాశక్తి-నందిగామ : ఐతవరం వద్ద విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద ఉధృతిని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పరిశీలించారు. వరద క్రమంగా తగ్గుముఖం పడుతుందని, ఇప్పటికే 2 అడుగుల మేర వరద నీటిమట్టం తగ్గిందని అన్నారు. మరికొంత సమయం వేచి చూసి జాతీయ రహదారిపై రాకపోకలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని, పై నుండి వస్తున్న వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని పేర్కొన్నారు. సాయంత్రం లోపు వరద నీటిమట్టం తగ్గే సూచనలు ఉన్నాయన్నారు. జాతీయ రహదారిపై వరద ప్రవాహం తగ్గిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సాయంత్రానికి వాహనాల రాకపోకలను కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనదారులకు, ప్రయాణికులకు అల్పాహారం, వాటర్ బాటిళ్లు, వారికి అవసరమైనవి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.