Jun 11,2023 15:56

ప్రజాశక్తి-చంద్రగిరి : చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డినీ ఆదరించి పాదయాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మండలంలో వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలతో ఆదివారం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా ప్రతి ఇంటిలో మోహిత్ రెడ్డిని పరిచయం చేయాలి, ప్రజలకు దగ్గరగా వున్నపుడే నాయకునిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇప్పటికే ప్రతి పంచాయతీకి రూ.2 కోట్లు తక్కువ లేకుండా కేటాయించడం జరిగిందని, అర్హత కలిగిన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు, తుడా అభివృద్ధి పనులతో ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లగలిగే సామర్ధ్యం మనకు మాత్రమే ఉందని, నాలుగేళ్ల పాటు గ్రామాల్లో మనం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి చెప్పాలని అన్నారు. ఇంతకాలం ఎలా వున్నా సరే ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, వారితో మమేకం కావాలని అన్నారు.హెల్త్ చెకప్ లు అనంతరం రిపోర్ట్ ల మేరకు అంతటా మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేస్తాం, ఇప్పటికే చంద్రగిరి నియోజక వర్గంలో ఎక్కడ పెళ్లి జరిగినా పెళ్లి కానుకలను పంపుతున్నామని అన్నారు. మార్కెట్ లలో ఉచితంగా క్రయ విక్రయాలు సాగించే వెసులుబాటు కల్పించాం, విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే విషయంలో ప్రయత్నలోపం లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. కుల, మత,రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు అందరినీ గౌరవిస్తున్నాం, మనం చేసిన సాయాన్ని ప్రజలు మరువరు, ప్రతి మంచి పని మన వెంట ఉంటుందని అన్నారు. నా ప్రజలందరూ బాగుండాలని నా ఆదాయంలో 75శాతం ఖర్చు చేస్తున్నాను,ప్రతి గడప తొక్కాలి, ప్రతి అక్క అన్న, చెల్లెలు తో మాట్లాడాలి, చేసిన అభివృద్ధిని వివరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.