Nov 03,2022 06:49

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 11,12 తేదీలలో జరపనున్న పర్యటన ప్రాధాన్యత నంతరించుకుంది. ప్రధాని హోదాలో మోడీ ఇప్పటికే రెండు సార్లు విశాఖకు వచ్చారు. రాష్ట్ర ప్రజలకు ప్రతిష్టాత్మకమైన ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టిన తరువాత ఆయన విశాఖకు రావడం ఇదే మొదటిసారి. గతంలో వచ్చిన రెండు సందర్భాల్లోనూ మోడీ విభజన కష్టాలపైనా, ప్రత్యేక హోదా పైనా పెదవి విప్పలేదు. ఇప్పుడు విశాఖ ఉక్కు అంశం ముందుకు వచ్చింది. స్టీలు ప్లాంటు అమ్మకాన్ని ఆపివేసి, ప్రభుత్వ రంగంలోనే దానిని కొనసాగిస్తున్నట్లు ప్రధాని ప్రకటించాలని ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. మరో కీలకాంశమైన విశాఖ రైల్వేజోన్‌ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం దోబూచులాట ఆడుతూనే ఉంది. ప్రధాని పర్యటనలో విశాఖ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులతో కలిసి రైల్వేజోన్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారని వైసిపి నేతలు చెబుతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనేమి ఇంతవరకు వెలువడలేదు. రైల్వేజోన్‌కు శంకుస్థాపన చేస్తున్నారా, భవనానికి చేసి సరిపెడతారా అన్నవిషయంపై కూడా స్పష్టత లేదు. అదే సమయంలో విశాఖ జోన్‌లోనే వాల్తేర్‌ డివిజన్‌ను కొనసాగించాలన్న డిమాండ్‌నూ మోడీ సర్కారు పెడచెవిన పెట్టింది. వాల్తేరు డివిజన్‌ లేకుండా విశాఖ జోన్‌ తల లేని మొండెం మాదిరి తయారవుతుందని, ఏ మాత్రం లాభదాయకం కాదంటున్న ప్రజల వాదనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీటితో పాటు ప్రత్యేకహోదా, పోలవరం నిర్వాసితుల సమస్యలతో పాటు రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అనేక అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇవ్వాల్సిన ప్యాకేజీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభ నుండే వివిధ పథకాల, ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ప్రధాని మోడీ చేస్తారని చెబుతున్నారు. అనంతరం ప్రత్యేకహోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు పరిరక్షణ వంటి అంశాల ప్రస్తావన లేకుండా ప్రధాని ప్రసంగం సాగితే ఎటువంటి ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రజానీకం ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రధానిపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. విశాఖ ఉక్కును తెగనమ్మాలన్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే కాబట్టి, ప్రధాని రాక సందర్భంగా నిరసన తెలపడానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కార్యాచరణను కూడా ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి వైసిపి కూడా మద్దతు ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలోనూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అంతటితో తమ పని అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటే కుదరదు. 600 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న కార్మికుల ఘోషను ప్రధాని దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పెద్దలదే! వైసిపి నేతలే చొరవ చూపి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించవచ్చు.
విభజన కష్టాలు, నష్టాలతోపాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా అతలాకుతలమవుతున్న రాష్ట్ర ప్రజానీకం ప్రధాని పర్యటనలో నిరసన తెలియచేస్తే అది న్యాయబద్దమైన స్పందనే అవుతుంది. అలా తెలియచేయడం, ప్రజల పక్షాన గొంతు విప్పడం ప్రజాస్వామ్యంలో పార్టీల, సంఘాల బాధ్యత కూడా! కొందరు వైసిపి నేతలు దీనికి భిన్నంగా ప్రధాని పర్యటనలో నిరసన ధ్వనులు వినిపించకూడదని, రాజకీయ పార్టీలకు ఈ కార్యక్రమంతో సంబంధం లేదని మాట్లాడుతుండటం సరికాదు. నిజానికి ప్రజల ఆకాంక్షను ప్రధాని దృష్టికి తీసుకుపోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇదో అవకాశం. అఖిలపక్ష బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లి రాష్ట్ర సమస్యలపై చర్చించే అవకాశాన్ని పరిశీలించాలి. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించబోమని, సొంత గనులు కేటాయిస్తామని, విభజన సమస్యల పరిష్కారానికీ ప్రధాని ఈ పర్యటనలో హామీ ఇవ్వాలి.