Jul 25,2021 21:46

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఒలింపిక్స్‌ క్రీడాకారులకు మద్దతుగా ఇప్పటికే ప్రారంభమైన 'విక్టరీ పంచ్‌ క్యాంపెయిన్‌'ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. 'మన్‌ కీ బాత్‌'లో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో ఆడుతున్న ప్రతి ఒక్కరూ విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రారంభమైన 'హమారా విక్టరీ పంచ్‌' ద్వారా ప్రతి ఒక్కరూ ఆటగాళ్లకు అండగా నిలవాలన్నారు. సోమవారం 'కార్గిల్‌ విజయ దివస్‌' సందర్భంగా 1999లో మన దేశం కోసం సర్వస్వాన్ని అర్పించిన జవాన్లకు నివాళులర్పించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగిడబోతున్నామని, అందుకే ఇది చాలా ప్రత్యేకమని, 'అమృత్‌ మహోత్సవ్‌' కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 'నేషన్‌ ఫస్ట్‌.. ఆల్వేస్‌ ఫస్ట్‌' అనే ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15న జాతీయ గీతాన్ని ఆలపించి రికార్డు చేయాలని, దాన్ని రాష్ట్రగాన్‌.ఇన్‌కు అప్‌లోడ్‌ చేయాలని కోరారు. దేశ ప్రజలందరూ భయాన్ని వీడి, వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకు రావాలన్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని, చేనేత వస్త్రాలు కొని ప్రతిఒక్కరూ వారికి అండగా నిలవాలని కోరారు. వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ వెదర్‌ మేన్‌గా పేరొందిన తిరుపతికి చెందిన బెంగళూరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సాయిప్రణీత్‌సహా పలువురి విశిష్ట సేవలను మోడీ అభినందించారు.