Oct 19,2023 08:59
  • కొత్త నిబంధనల వల్ల ఎపికి అన్యాయం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసి) కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని, వాటిని సడలించి పాత పద్ధతి కొనసాగించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని కోరారు. ఈ మేరకు బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయను మంత్రి విడదల రజిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ప్రతి రాష్ట్రంలో ప్రతి పది లక్షల మంది జనాభాకు వంద సీట్లు చొప్పున మాత్రమే అనుమతి ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని తెలిపారు. కొత్త మెడికల్‌ కళాశాలలకు అనుమతి ఇవ్వాలంటే 605 పడకల సామర్ధ్యంతో ఆసుపత్రి కూడా ఉండాలని ఎన్‌ఎంసి తాజాగా నిర్ణయించిందని చెప్పారు. ఈ రెండు నిబంధనల వల్ల కొత్తగా ఏర్పడిన తమ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం విభజన తరువాత టెర్షియరి కేర్‌ సర్వీసెస్‌ విషయంలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్రంలో రూ. 8,480 కోట్లతో 17 కొత్త మెడికల్‌ కళాశాలలను నిర్మిస్తున్నామని, వీటిలో ఇప్పటికే ఐదు మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. మిగిలిన 12 కళాశాలల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.