మయూరి వాహనంపై మల్లన్న దంపతులు
ప్రజాశక్తి - శ్రీశైలం
శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గోరోజు మంగళవారం మయూరి వాహనంపై మల్లన్న దంపతులు ఆశీనులై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మ వార్లకు ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలు ప్రత్యేక అర్చకుల చేత నిర్వహించారు. సాయంకాలం అక్క మహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా వివిధ రకాల పూలతో అలంకరించి మయూర వాహనంపై ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను వివిధ రకాల కోలాటం, చెక్కభజన, బుట్ట బొమ్మలు, నృత్య ప్రదర్శనలు, విద్యుత్ దీపాలు, వేదమంత్రాల మధ్య ఆలయ రాజగోపురం ద్వారా ప్రధాన వీధిలోకి ప్రవేశించారు. మరోసారి ప్రత్యేక పూజ నిర్వహించారు. రథశాల వద్ద నుండి నంది గుడి, బయలు వీరభద్ర స్వామి వరకు, అక్కడి నుండి ఆలయంలోకి ప్రత్యేక గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు : ఉత్సవాలలో భక్తులను అలరించేందుకు దేవస్థానం పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. నిత్య కళారాదన వేదికపై, పుష్కరిని వద్ద, శివ దీక్ష శిబిరాలలో సాయంత్రం 6 గంటల నుండి ఏర్పాటు చేసినట్లు ఇఒ లవన్న తెలిపారు.
కాణిపాకం, టిటిడి తరపున పట్టు వస్త్రాల సమర్పణ : భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం తరపున ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఎ.మోహన్‌రెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎ. వెంకటేశుపట్టువస్త్రాలను సమర్పించారు. అలాగే సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరు విడివిడిగా ఉదయం, సాయంత్రం పట్టు వస్త్రాలతో ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగానే సాంప్రదాయ ప్రకారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేద పండితులు స్వాగతం పలికారు. ఆ తర్వాత ముందుగా స్వామివారికి, అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.










