Nov 16,2022 00:04

మయోపియా వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న వైద్యులు

ప్రజాశక్తి - ఆరిలోవ : చిన్నారుల్లో ఎక్కువగా వచ్చే మయోపియా కంటి వ్యాధిని నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎల్‌వి ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, జిఎంఆర్‌ వరలక్ష్మి ప్రాంగణంలో గల నిమ్మగడ్డ ప్రసాద్‌ చిల్డ్రన్‌ ఐ కేర్‌ సెంటర్‌ వైద్యులు వీరేంద్ర సచ్‌దేవా సూచించారు. బాలల నేత్ర సంరక్షణా వారోత్సవాల్లో భాగంగా పిల్లల్లో వచ్చే మయోపియా వ్యాధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అవగాహన కార్యక్రమాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సదర్భంగా డాక్టర్‌ వీరేంద్ర సచ్‌దేవా, డాక్టర్‌ స్నేహల్‌, డాక్టర్‌ విశ్వత్‌ మాట్లాడుతూ, ప్రస్తుతం మయోపియా వ్యాధి వేగంగా పెరుగుతుందన్నారు. ఇటీవల కాలంలో పెరిగిన డిజిటల్‌ ఎక్స్‌పోజర్‌, ఇంట్లోనే ఉంటున్న జీవనశైలి, కోవిడ్‌ -19 మహమ్మారి ప్రభావం, మితి మీరిన హోం వర్క్‌ తదితర కారణాలతో పిల్లలు మయోపియా వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందన్నారు. తక్కువ సమయం నిద్రపోవడం, పోషకాహార లోపం కూడా మయోపియా అభివృద్ధికి ప్రధాన కారణాలేన్నారు. 2050 నాటికి భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలో 10 మంది పిల్లల్లో 5 గురికి మయోపియా వచ్చే అవకాశం ఉందన్నారు. డిజిటల్‌ స్క్రీన్‌ చూసే సమయం తగ్గించడం, ఆరుబయట కార్యక్రమాలను ప్రోత్సహించడం, పాఠశాలల్లో 60 నిమిషాలు విరామ సమయం పాటించడం, శారీరక వ్యాయామానికి ఒక పీరియడ్‌ కేటాయించడం చేయాలని సూచించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌ పిల్లల కంటి ఆసుపత్రిలో దీనికి సమర్ధవంతంగా చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.