ఆగేయాసియాలోని నిరుపేద దేశమైన మయన్మార్ మరోసారి సైనిక పాలనలోకి పోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది గంటల ముందు మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవడంపై ఐక్యరాజ్యసమితితో సహా పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. నిర్బంధంలో ఉన్న ఆంగ్‌సాన్ సూకీని, ఇతర అగ్ర నేతలను విడుదల చేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని యాంగాన్ వీధుల్లోకి వచ్చి డిమాండ్ చేస్తున్న నిరసనకారుల పైకి సైన్యం యుద్ధ ట్యాంకులను ఎక్కుపెట్టింది. మీడియా, సామాజిక ప్రచార మాధ్యమాలపై ఆంక్షలు విధించింది. మానవ హక్కులను బాహాటంగా కాలరాస్తున్నది.
అయిదు కోట్ల జనాభా కలిగిన మయన్మార్‌లో సైనిక కుట్రలు కొత్తేమీ కాదు. 1948లో స్వాతంత్య్రం సాధించిన తరువాత మొదటి పద్నాలుగేళ్లు ప్రజాస్వామ్య పాలన కింద ఉన్న మయన్మార్‌లో 1962లో సైన్యం ఒక్కసారిగా తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారం తమ చేతుల్లోంచి జారిపోకుండా యత్నిస్తున్న సైనిక నియంతలకు 1988లో మొదటిసారి ప్రతిఘటన ఎదురైంది. బ్రిటన్ నుంచి మయన్మార్‌కు తిరిగి వచ్చిన ఆంగ్‌సాన్ సూకీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డి)ని స్థాపించి మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించారు. 1990లో జరిగిన ఎన్నికల్లో సూకీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ ఎన్నికల్లో 58 శాతం ఓట్లతో, పార్లమెంటులో 492 స్థానాలకు గాను 382 స్థానాలు గెలుచుకున్నారు.మిలిటరీ అనుకూల పార్టీకి కేవలం పది సీట్లుమాత్రమే వచ్చాయి. సూకీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని తిరిగి తన గుప్పెట్లో పెట్టుకుంది. సూకీని గృహనిర్బంధంలో ఉంచింది. ఇప్పుడు కూడా సరిగ్గా అదే పరిస్థితి పునరావృతమైంది. గత ఏడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో సూకీ పార్టీకి పార్లమెంటులో 440 స్థానాలకు గాను 315 స్థానాలు లభించాయి. 224 స్థానాలు ఉన్న ఎగువ సభలో 161 స్థానాలు గెలుచుకుని తిరుగులేని శక్తిగా అవతరించింది. సూకీ బలపడడం తమ ప్రయోజనాలకు ముప్పుగా భావించిన సైన్యం మళ్లీ అదే తరహాలో తిరుగుబాటు చేసింది. మయన్మార్‌లో సైనిక నియంతృత్వాన్ని మూడు దశాబ్దాలుగా సవాల్ చేస్తూ వస్తున్న ఆంగ్‌సాన్ సూకీని సైన్యం ఎంతమాత్రం సహించలేదనడానికి తాజా తిరుగుబాటు ఒక నిదర్శనం. ఎన్ని నిర్బంధాలెదురైనా కీలకమైన డిమాండ్ల విషయంలో సూకీ రాజీ పడలేదు. సైనిక పాలనను అంతమొందించి దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఆమె కట్టుబడి వున్నారు. 2008లో సైన్యం తీసుకొచ్చిన కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించేందుకు తొలుత నిరాకరించిన సూకీ, ఆ తరువాత సైనిక జనరల్ ధీన్ సేన్ పన్నిన మాయోపాయంలో చిక్కుకున్నారు. కొత్త రాజ్యాంగం మిలిటరీకి పార్లమెంటులో 25 శాతం సీట్లు రిజర్వు చేయాలని, ప్రభుత్వంలో కీలకమైన రక్షణ, హోమ్, బోర్డర్ శాఖలను సైన్యానికి కేటాయించాలని చెబుతోంది. సూకీ పిల్లలు విదేశీయులుగా ఉన్నందున ఆమెను అధ్యక్ష పదవికి అనర్హురాలిని చేసిన నిబంధన కూడా ఈ కొత్త రాజ్యాంగంలో పొందుపరిచారు. మయన్మార్‌ను ప్రజాస్వామ్యం పరివర్తన దిశగా తీసుకెళ్తామన్న సైనిక పాలకుని మాటల్లో ఇంత మోసం ఉంటుందని ఆమె ఊహించలేకపోయారు. 2015లో ఎన్‌ఎల్‌డి భారీ విజయం సాధించినప్పటికీ ఆమె అధ్యక్షురాలు కాలేకపోవడానికి విదేశీ నిబంధన అడ్డం వచ్చింది. దీంతో ఆమె కోసం స్టేట్ కౌన్సిలర్ అన్న పదవిని సృష్టించారు. అంతే తప్ప సైన్యం తన అధికారాలను వదులుకోవడానికి సిద్ధం కాలేదు. దీంతో సైన్యానికీ, సూకీకి మధ్య వైరుధ్యం అలాగే కొనసాగుతోంది. ప్రజాస్వామ్య పునాదులపై నవ మయన్మార్ నిర్మించాలన్న లక్ష్యం నెరవేరలేదు. జాతుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పుతామని హామీ ఇచ్చిన సూకీ 2017లో రఖీనే రాష్ట్రంలో రోహింగ్యాలపై సైన్యం సాగించిన ఊచకోతను బహిరంగంగా సమర్థించారు. ఇది అంతర్జాతీయంగా ఆమె ప్రతిష్టను మసకబారేలా చేసింది. సైన్యానికి దాసోహమయ్యారన్న అపఖ్యాతిని ఆమె మూటగట్టుకున్నారు. ఇటువంటి ఒకటి రెండు తప్పిదాలు ఉన్నప్పటికీ సూకీ మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం సాగిస్తున్న పోరాటం మహత్తరమైనది. ఆమెకు సంఘీభావంగా అంతర్జాతీయ సమాజం నిలవాల్సిన అసవరముంది. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా కీలకమైన మయన్మార్‌లో పరిణామాలు భారత్‌పై కూడా ప్రభావం చూపుతాయి. అయితే ఇక్కడ సొంత పౌరులపై ఫాసిస్టు పద్ధతులను ప్రయోగిస్తూ, ప్రజా ఉద్యమాలపై దమన కాండను సాగిస్తూ, తమను ప్రశ్నించేవారిని , విమర్శించే వారిని సైతం తప్పుడు కేసులలో ఇరికించే కుట్రలకు పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వం పొరుగు దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతుంటే నోరు విప్పాలని ఆశించడం అత్యాశే. అంతర్జాతీయ పౌర సమాజంతోబాటు మన దేశపు లౌకిక ప్రజాస్వామ్యవాదులంతా మయన్మార్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గొంతు కలపాలి.










