May 01,2023 15:33
  • కార్మిక చట్టాలను రక్షించుకుందాం:
  • సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి"

ప్రజాశక్తి-తిరుపతి : దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు కార్మికుల పట్ల అనుసరిస్తున్న నిర్బంధ విధానాలను కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి కార్మికులకు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా సోమవారం నాడు వివిధ సభలలో కందారపు మురళి పాల్గొని ప్రసంగించారు. తిరుపతి రుయా ఆస్పత్రి, స్విమ్స్ ఆసుపత్రి, టీటీడీ అన్నమాచార్య కళామందిరం, టీటీడీ పరిపాలన భవనం, సిపిఎం జిల్లా కార్యాలయం, సిఐటియు జిల్లా కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, బిల్డింగ్ కార్మికుల సమావేశం, పాత్రికేయుల సమావేశంలో కందారపు మురళి ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాలను రద్దుచేసి మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ లను తెచ్చిందని దేశంలో 12 గంటల పని విధానానికి అంకురార్పణ  చేసిందని అన్నారు. మే దినోత్సవ స్ఫూర్తి ఎనిమిది గంటల పని విధానంకై పోరాటమని, ఇప్పుడు మళ్లీ పాత రోజుల్లోకి వెళ్తున్నామని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 గంటల పని విధానాన్ని అధికారికంగా ప్రకటించిందని గుర్తు చేశారు. ధరలు పెద్ద ఎత్తున పెరుగుతుంటే కార్మికుల నిజ వేతనాలు రోజురోజుకు కుదించబడుతున్నాయన్న వాస్తవాన్ని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దిగజారుడు నిర్బంధాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అటవీ కార్మికులు 903 రోజులుగా పోరాడుతున్నా పట్టించుకునే దిక్కు లేదని ధ్వజమెత్తారు. కనీస రాజ్యాంగ విలువలు మరిచిపోయి టీటీడీ ఈఓ, జిల్లా కలెక్టర్, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు టిటిడిలో పొరకలు చేత బట్టి కార్మికుల మెడపై కత్తి ఉంచడం దారుణమని అన్నారు. పారిశుద్ధ్య సేవలకు వెచ్చించే సమయంలో పదో వంతు కార్మిక సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేసి ఉంటే తిరుమల కొండపై ఈ దుస్థితి ఏర్పడి ఉండేది కాదని అన్నారు. కాంట్రాక్టు, పర్మినెంట్, ఔట్సోర్సింగ్ అన్న పేర్లు ఉద్యోగ కార్మికులు మర్చిపోవాలని ఐకమత్యంతో పోరాడి సమస్యలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలలో సిఐటియు జిల్లా కోశాధికారి కేఎన్ఎన్ ప్రసాదరావు, ఆర్. లక్ష్మి, వేణుగోపాల్, మల్లికార్జునరావు, మోహన్ రావు చిన్నా, మునిరాజ, రేఖా, గంగులప్ప, చంద్రశేఖర్ భాగవతార్, సుబ్రహ్మణ్యం, రవి, సుబ్బు, గురవయ్య, జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు