ప్రజాశక్తి- సీతమ్మధార: ముఠా కార్మికుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా దుష్ప్రచారం చేస్తున్న న్యూ ఆంధ్ర మోటార్స్, ట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.సుబ్బారావు డిమాండ్ చేశారు. గురువారం అక్కయ్యపాలెం కార్మికశాఖ కార్యాలయం వద్ద ముఠా కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని ముఠా కార్మికులు నిత్యం పోరాటాలు సాగిస్తూనే ఉన్నారని, అంతేకాక కడప మార్బుల్‌్‌స వంటి బరువైన వస్తువుల అన్‌లోడింగ్‌లో కార్మికుల కష్టానికి అనుగుణంగా వేరే రేట్లు నిర్ణయించబడతాయన్నారు. దీనిపై అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు వై రాజు, టీ పైడిరాజు, తాతారావు పాల్గొన్నారు.










