
ప్రజాశక్తి-అచ్యుతాపురం
ముఠా కార్మికుల సంక్షేమానికి సమగ్రమైన చట్టం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఠా కార్మికులకు గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఈఎస్‌ఐ, పని భద్రత, ప్రమాద బీమా, పెన్షన్ వంటి సదుపాయాలు కల్పించాలని కోరుతూ అచ్చుతాపురంలో గురువారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు గోదాముల్లో పనిచేసే కార్మికులు పని భద్రత, ప్రమాద బీమా వంటి సదుపాయాలకు నోచుకోలేదన్నారు. ప్రమాదాల్లో ముఠా కార్మికులు మృతి చెందితే వారి కుటుంబాలను ఆదుకునే నాధుడు లేడని చెప్పారు. ముఠా కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించి అమలు చేయాలన్నారు. అధిక బరువులు మోయడం వలన రోజుకు 12 గంటల నుండి 16 గంటల పని చేయడం వలన చిన్న వయసులోనే వృద్ధాప్య దశకు చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ముఠా కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. ప్రమాదానికి గురైన ముఠా కార్మికులకు యాజమాన్యం, ప్రభుత్వం వైద్య సేవలు అందించాలని, ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.10 లక్షలు, సాధారణ వృద్ధులకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె.చెంచమ్మ, వి.జోగినాయుడు, పి. రాజు, కే. రామకృష్ణ, ఈ .కోనారి పాల్గొన్నారు.