Jul 19,2023 00:20

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు

ప్రజాశక్తి - సోమవారం
ముఠా కార్మికులకు సమగ్ర చట్టం తేవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో అనకాపల్లి జిల్లా ముఠా కార్మిక సంఘం సమావేశం ఆర్‌ రాము అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్యఅతిథిగా కోటేశ్వరరావు మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులు మండల కేంద్రాలు, ప్రభుత్వ సివిల్‌ సప్లై గోడౌన్‌, బేవరజస్‌ కార్పొరేషన్‌, వ్యాపార సముదాయాలలో పని చేస్తున్నారని, వీరికి ఎటువంటి సమగ్ర చట్టం లేదని, వయసు మళ్ళిన తర్వాత ఎటువంటి ఆదరణ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సరుకులు లోడింగ్‌ అన్లోడింగ్‌ చేస్తూ వ్యాపారానికి తోడ్పాటు నందిస్తున్నారని, ఈ సమయంలో ప్రమాదాలు జరిగితే వీరిని ఆదుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రంలో ముఠా కార్మికులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి సమగ్ర చట్టం, కనీస వేతనం అమలు చేస్తున్నారని, అయితే మన రాష్ట్రంలో మాత్రం ఎటువంటి చట్టం అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. అటువంటి చట్టాలు లేకపోవడం వల్ల కార్మికుల జీవనం దుర్భరంగా మారుతుందని పేర్కొన్నారు. ముఠా కార్మికులకు భద్రత కల్పించాలని, 60 ఏళ్లు దాడిన వారికి పెన్షన్‌, గ్రాడ్యుటీ, పిఎఫ్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ లాంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న, సత్తిబాబు, బర్ల రమణ, కాపుశెట్టి అప్పారావు, నానాజీ, రాజు, అప్పారావు పాల్గొన్నారు.