
ఏ స్టేషనో మరి, రైలు ఐదు నిమిషాల కంటే ఎక్కువే ఆగింది.
అర్ధరాత్రి కావడంతో ప్లాట్‌ఫాం మీద పల్చగానే ఉన్నారు జనం. ఎవరో ఎక్కుతున్నట్లున్నారు, మాటలు వినపడుతున్నాయి. కంపార్ట్మెంట్‌లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.
బెర్త్ నంబర్లు సరి చూసుకుంటూ, సామాన్లు సర్దుతున్నారు పక్క క్యాబిన్‌లో.
కొద్ది క్షణాల్లో కదిలింది ట్రైన్. అంతా సర్దుకున్నాక వాష్‌రూంకి వెళ్లాలని లేచాను.
తిరిగి వస్తుండగా, సన్నటి మూలుగు లాంటిది వినపడి ఉలిక్కిపడి, వెనక్కి చూశాను.
తలుపు మూలగా వణుకుతూ నిలబడి ఉందామె. రేగిపోయిన జుట్టు. మొహాన రక్తం ఉబ్బరిస్తూ గాట్లు. చెంప కమిలిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చుడీదార్ భుజాన చిరిగి ఉంది. చెప్పులు కూడా లేవు.
ఎవరు? సెకండ్ ఏసీలో ఎక్కగలిగే మనిషిలా కనిపించటం లేదు. సడన్‌గా తెలీక ఎక్కేసిందా? ఆ దెబ్బలేంటి?ఎవరైనా వెంటబడ్డారా?
'ఎవరమ్మా? ఇక్కడున్నావేంటి? కంపార్ట్ మెంట్ నంబర్ తెలీక ఎక్కావా? ఏమైంది? ఆ దెబ్బలేంటి?' అన్నాను కొంచెం విస్మయంగా.
'ఆ దెబ్బలేంటి?' అంటుండగానే ఆ పిల్ల మొహంలోకి దుఃఖం పొంగుకొచ్చింది.
సల్వార్ ఎత్తి చెంపల మీదికి జారిపోతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ, 'కొడుతుంటే, తప్పించుకోడానికి ఎక్కేసినానమ్మా, మళ్ల బండి ఆగినాక దిగిపోతాను' అంది దోషిలాగా తలవంచుకుంటూ.
ఆమె డ్రెస్ వైపు చూసి అదిరిపడ్డాను. పాపం పీరియడ్స్‌లో ఉన్నట్టుంది. రక్తం మరకలు పైజమా నిండా.
గబ గబా సీటు దగ్గరికి వచ్చి, నా బాగ్‌లోంచి పాడ్ తీసుకెళ్లి ఇచ్చాను.
'ఇది వేసుకో, మంచి నీళ్లు తాగుతావా?'
'ఇక్కడ తాగుతాలేమ్మా' అంది వాష్‌బేసిన్‌లోని పంపు వైపు చూపిస్తూ..
గుండె ద్రవించిపోయింది.
వాటర్ బాటిల్ తెచ్చేసరికి పాడ్ వేసుకుని వచ్చి, చేతులు కడుక్కుంటోంది.
'ఏమైంది? కొట్టింది ఎవరు?' అన్నాను బాటిల్ ఇస్తూ.
గబ గబా నాలుగు గుక్కలు నీళ్లు తాగి, ఒక్క క్షణం కళ్లు మూసుకుని నిలబడింది.
'నా మొగుడేనమ్మా. ఎంటబడి కొట్టే దవిర్నం, హక్కు ఎవరికుంటాదమ్మా?' అంది కింద చతికిలబడి కూచుంటూ. శానిటరీ పాడ్ ఆమెకు విశ్రాంతిగా కూచునే ధైర్యాన్ని ఇచ్చిందని అర్థమైంది.
'ఇక్కడ వద్దు, నాది సైడ్ బెర్తే. రా, అక్కడ కూచుందువుగానీ. కాసేపు నిద్ర పోవచ్చు' అన్నాను.
'వొద్దమ్మా, టికెట్లాయన వస్తే కష్టం కదా, రైలు ఆగ్గానే దిగిపోతా వచ్చే స్టేషన్‌లో' అంది దండం పెడుతూ.
'మళ్లీ వెనక్కి వెళ్తావా? డబ్బులున్నాయా? ఇవ్వనా?'
సానుభూతి భరించడం ఆత్మాభిమానం గల వ్యక్తికి, అది స్త్రీ అయినా పురుషుడైనా చాలా కష్టం.
కుళ్లి కుళ్లి ఏడవటం మొదలుపెట్టింది, శబ్ధం రాకుండా జాగ్రత్తపడుతూ..
కాసేపు ఏడవనిచ్చాను.
'బాయిలో దూకి, సావనన్నా సస్తానుగానీ ఆడి దగ్గరికి పోనమ్మా. వొంట్లో ఇరగని ఎముక లేదు. ఇంక తిన్లేనమ్మా ఆ దెబ్బలు. నా వల్ల గాదు. యాణ్ణో ఒక సోట ఇంత పని చేసుకుంటే ఒక ముద్ద దొరక్కపోదు.'
'పిల్లలా?'.. 'అదురుష్టం, పిల్లలు లేరమ్మా. ఉంటే వాళ్ల కోసమైనా ఆడే పడుండాల్సి వచ్చేది. రెక్కలు ముక్కలు చేసుకోని డబ్బులు సంపాదించి, వాడి మొహాన పోస్తానమ్మా. అయినా తాగొచ్చి కొడతాడు. తాగకపోయినా కొడతాడు. పేకాట ఆడొచ్చి కొడతాడు. డబ్బులు వచ్చినా, పోయినా కొడతాడు.'
పైజామా భుజం మీద నుంచి పక్కకు జరిపి చూపించింది. భుజాల మీదా, వీపు మీదా కదుములు కట్టిన దెబ్బలు, మచ్చలు.
ఏమనాలో తోచలేదు.
'పక్క స్టేషన్లో దిగిపోతే ఇవాళ కాకపోతే రేపైనా కనుక్కుంటాడు.. నువ్వెక్కడ ఉన్నావో.'
కళ్లు తుడుచుకుని లేచి, చన్నీళ్లు మొహాన కొట్టుకుని ఆలోచిస్తూ నిలబడింది.
'టీసీ వస్తే నేను మాట్లాడతాన్లే. హైదరాబాద్ వస్తావా నాతో. పని ఇప్పిస్తాను. మా ఇంట్లోనే ఉండచ్చు. నేనొక్కదాన్నే ఉండేది. హాయిగా నీ పొట్ట నువ్వు పోసుకోవచ్చు. ముందు నాతో రా. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దువుగానీ' ఆలోచించానో లేదో తెలీదు. కానీ ఎవరో ఏమిటో కూడా తెలీకుండానే ఆ పిల్లను ఈ పరిస్థితి నుంచి బయటికి లాగాలని సిద్ధమయ్యాను.
వింతగా చూసింది నా వైపు.
'మీ వోళ్లెవరూ ఏమీ అన్రా అమ్మా?' అంది కొంచెం ఆశ కళ్లలో నింపుకుని.
'ఎవ్వరూ ఏమీ అనరు. నీకే భయమూ లేదు. మా ఇంటికి వెళ్దాం రా. నీ పేరేంటి ఇంతకీ?'
'ముత్యాలు.'
పరీక్షగా చూశాను. ముత్యంలాగే ఉంది. బారెడు జడ, సన్నని నడుము, తెలుపులో చేరే రంగు. చారెడేసి కళ్లు.
ఎందుకు కొట్టడూ? అనుమానం రోగానికి మందేముంది?
000
ముత్యాలు మొగుడు మెకానిక్‌గా పని చేసేవాడు. డబ్బులన్నీ తాగి, పాడు చేస్తుంటే, ముత్యాలు బజ్జీలు, పునుగులు వేసే బండి పెట్టింది. తెలిసిన వాళ్లెవరో బండి ఇప్పించారు అద్దెకి. సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిది వరకూ.
సెంటర్‌లో పెట్టడం వల్ల కుప్పలు తెప్పలుగా జనం వచ్చి, ఒక్కోసారి ఎనిమిది కల్లా పిండి అయిపోయి, బండి కట్టేసే స్థితి ఉండేది. నాలుగు అయ్యే సరికి జనం ముత్యాలు వేసే బజ్జీల కోసం బండి దగ్గర వెయిటింగ్‌లో ఉంటారు.
చేతికిందికి ఇద్దరు మనుషుల్ని పెట్టుకుంది. తను బజ్జీలు వేస్తుంటే, కస్టమర్లకు సర్వ్ చేయడానికీ, పార్సిళ్లు కట్టివ్వడానికీ.
మొగుడిని సాయానికి రమ్మంటే 'ఏమనుకుంటున్నావే నన్ను? నీ కొట్టు కాడ పొట్లాలు కట్టాల్నా? ఆడంగి నా కొడుకుని అనుకుంటున్నావా?' అని కొట్టడానికొచ్చాడు.
రాత్రి కాగానే తాగొచ్చి, ముత్యాలు దగ్గర డబ్బులు లాక్కుంటాడు. మర్నాటికి సరుకుల కోసం కూడా ఉంచకుండా లాక్కునేవాడు ఒక్కోసారి.
బండి దగ్గరికి వచ్చే మగాళ్లందరితో ముత్యాలుకి రంకు కట్టడమే రాజు ప్రధాన వ్యాపకం. అలాగని 'పని మానేస్తా, బండి కట్టేస్తా' అంటే ఒప్పుకోడు. ఆ బండి తెచ్చే రూపాయల మీద అంత ప్రేమ.
'బండి కాడ బజ్జీలేసే దానికి ఆడితో ఈడితో కబుర్లేందంటా? పన్లో పడితే కబుర్లెట్టా వొస్తాయంటా' చిటపటలాడేవాడు. ఎప్పుడూ కిల కిలా నవ్వుతూ, చక చకలాడే ముత్యాల్ని చూస్తే రాజుకి అసహనం. తను ముత్యాలుకి తగనని లోపల ఎవరో అరుస్తూ ఉంటారు అతగాడి మనసులో. అందరితో కలివిడిగా ఉంటూ చుట్టూ నవ్వులు పూయించే ఆ చలాకీతనాన్ని నాశనం చేసేసి, నోరు మూయించి, మూల కూచోబెట్టాలని కసిగా ఉంటుంది. నలుగురితో మాట్లాడకుండా ఉండలేని ఆ స్వేచ్ఛని, ఆ సరదాని నలిపి వేయాలని ఉంటుంది.
'ఎవరింట్లో అయినా పాచిపన్లు చేసుకో. అంట్లు తోము, బయట రోడ్ల మీద పనేంది నీకు?' ఉదారంగా అవకాశమిచ్చాడు.
'నేనట్టా ఒక సోట కుసోని పని సెయ్లేను. నాకు ఉసారుగా ఉండాల పని' తెగేసి చెప్పిన రోజు ముత్యాలు చెంపలు పగిలిపోయాయి.
'నీగ్గావాల్సింది ఉసారు కాదే, మొగోళ్లు! సుట్టూ మొగోళ్లుంటే తప్ప సెయ్యలేవు పని నువ్వు' రాజు మాటలు ముత్యాలుని నొప్పించడం ఎప్పుడో మానేశాయి.
'సరే నువ్వు రా మరి మాయిటేలకి. నేను బజ్జీలేస్తా ఉంటా, నువ్వు పొట్లాలు కట్టు. నాక్కూడా చేతికింద మడిసుంటే పని ఈజీ అయ్యిద్ది' అందొకరోజు నవ్వుతూ.
ముత్యాలు నవ్వితే రాజుకి మండిపోతుంది.
'దొంగముండా, నీ చేతికింద పంజేసేదానికి అంత అతకలు చచ్చి ఉన్నానంటే? ఎంత దవిర్నమే నీకు? నీ బండి కాడికొచ్చి పొట్లాలు కట్టాలా? నా రేంజేందో తెల్సా నీకు? 'ఆడి' కారుకి తక్కువ కారైతే చూసే పని కూడా లేదు. నన్ను బట్టుకోని పొట్లాలు కట్టేదానికి రమ్మంటా?' ముత్యాలు వీపు మీద బెల్టు తెగింది. చెంపల మీద రాజు చేతులు అద్దం చూసుకున్నాయి. ముత్యాలు నవ్వులన్నీ కన్నీటి పువ్వులై రాలాయి.
దెబ్బలు తట్టుకోలేక ఏడ్చింది ముత్యాలు. కళ్లు తుడుచుకుంటూ 'అయితే నా రెక్కల కష్టం ముట్టుకోమాక నువ్వు. ఆడి కారో ఈడి కారో సూసుకుంటా, బాగు సేస్కుంటా బతుకు. ఇంకోసారి నా జోలికొస్తే ఊరుకోను' ఉక్రోషంగా అరిచింది.
రాజు విసిరిన స్పానర్‌ని ముత్యాలు తప్పించుకుని ఉండకపోతే, ఆ రోజే ఆమెకి ఆఖరు రోజై ఉండేది.
అలాటి రోజులెన్నో లెక్కపెట్టే తీరిక లేదు ముత్యాలుకి.
పని, పని పని!
ఉదయం దోసెలు, ఇడ్లీలు కూడా వేసే మరో బండి పెట్టింది ముత్యాలు. బజ్జీల బండి నుంచి రోజూ ఇంటికి బజ్జీలు పట్టుకెళ్లే బాంక్ ఉద్యోగి రమేష్‌తో ముత్యాలు పడుకుంది కాబట్టే లోను ఇప్పించాడనే వంకతో రోజూ దెబ్బలు తప్పేవి కాదు ముత్యాలుకి.
రోజూ దెబ్బలు ఎక్కువైపోతున్నాయి కానీ తగ్గేలా లేవు. పోలీసు కంప్లైంట్ ఇవ్వమని ఎవరు చెప్పినా విన్లేదు ముత్యాలు. 'తాగొస్తే మడిసి గాదు గానీ, ఆడికంత దవిర్నం లేదు. పోలీసులు కొడితే బతకడు, ఆడే ఎప్పటికో మారతాళ్లే' అని వూరుకునేది.
నిన్నటి రోజున మాత్రం, తాగొచ్చి చావ చితగ్గొట్టి, ప్రాణం తీసేస్తానని చేతికందిన ఇనప వస్తువేదో తీసుకుని వెంటపడ్డాడు. తప్పించుకుని పారిపోతూ రైల్వేస్టేషన్లోకొచ్చి, ఆగున్న రైలు చూసి, కనపడిన పెట్లోకి ఎక్కేసింది.
అదీ కథ. నిండా పాతిక నిండని యువతి ముత్యాలుకి వొంటి మీద ఖాళీ లేకుండా దెబ్బలు.. అణువణువునా పలకరించి, చోటు చేసుకున్నాయి. కొన్ని దెబ్బలు మాయని జ్ఞాపకాలను మచ్చలుగా మిగిల్చాయి కూడా.
000
స్నానం చేసి టిఫిన్ తిన్నాక సర్వెంట్ రూంలో పడుకుని, ఒళ్లెరక్కుండా నిద్ర పోయింది ముత్యాలు.
తిండి, విశ్రాంతితో రెండు, మూడురోజుల్లో పూర్తిగా తేరుకుంది.
'వెళ్తావా ఇంటికి? ఏం ఆలోచించుకున్నావ్?' అడిగాను.
తలొంచుకుని కూచుంది. కాసేపయ్యాక నీళ్లు నిండిన కళ్లతో తలెత్తి 'ఏదైనా పని చూడమ్మా, ఇక్కణ్ణే ఉంటా. పదేడేళ్లకి పెళ్లయిన కాణ్ణించి రోజూ తన్నులు తినీ తినీ ఒళ్లు మొత్తం ఇరిగి పోయిందమ్మా. ఇంగ తిన్లేను ఆ తన్నులు' తల్చుకుంటేనే ఆ పిల్ల కళ్లలో నీళ్లూరుతున్నాయి.
నా దగ్గర పని చేసే రాధకు చెప్పి, రెండిళ్లలో పని చూడమన్నాను. నా ఇంట్లోనే ఉండమన్నాను ముత్యాలుని.
ఏడో ఫ్లోర్‌లో ఉండే అనిత రోజంతా ఇంట్లో ఉండి, బాబుని చూసుకునే మనిషి కోసం చూస్తుందని తెల్సి ముత్యాలుని పంపాను. కడిగిన ముత్యంలా ఉండే ముత్యాలుకి ఎవరు పనివ్వరు?
చేతినిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రతో ముత్యాలు నెల రోజుల్లో పూచిన తంగేడులా తయారైంది.
రాజుని అపుడప్పుడూ తల్చుకునేది గానీ, తిరిగి వెళ్తానని మాత్రం అన్లేదు.
'నన్ను తన్నకుండా ఆడికి నిద్దరెట్టా పడతందోనమ్మా' అనేది నవ్వుతూ..
మరోసారి దిగులుగా 'నేను ఎవరితోనో లేచిపోయానని అందరితో సెప్పేసి ఉంటాడమ్మా. ఆడి అనుమానం మొదట్నించీ అదేగా? నా గురించి అంతా సెడ్డగా మాట్టాడుకుంటున్నారేమో అమ్మా' అనేది.
'ఎవరేం మాట్లాడుకుంటే నీకేంటి? హాయిగా తిని, పని చేసుకో. టివీ చూసుకో. ఏమీ పట్టించుకోకు' అంటే, దిగులుగా కూచునేది. తన వాళ్లని మిస్ అయ్యానని అనదు కానీ, తన గురించి చెడ్డగా మాట్లాడుకుంటారేమో అని వర్రీ అయ్యేది.
'ముత్యాలు నిప్పు' అని సెప్పుకుంటారమ్మా మా పేటలో.
జాలిగా చూశాను 'నువ్వేంటో నీకు తెలియాలిగానీ, ఎవరో మన గురించి ఏదో చెప్పుకోవాలని అనుకోవడం ఎందుకు ముత్యాలూ?' అన్నాను.
నా మాటలు ముత్యాలుకి నచ్చలేదు.
'ముత్యాలు నిప్పు లాంటి మడిసని నలుగురూ సెప్పుకుంటేనే గదమ్మా మనకి మరేద. మన సంగతి మనకెట్టైనా తెలుసు' అంది.
మరో ఆర్నెల్లలో ముత్యాలు నాలుగు డబ్బులు వెనకేసుకుంది. నవ నవలాడుతూ ఆరోగ్యంగా తయారైంది.
కానీ సంతోషంగా మాత్రం కనిపించడం లేదు.
ఎందుకంటే ఏమీ చెప్పదు. పోనే మీ వూరు వెళ్తావా? అంటే 'ఆమ్మో, పొనమ్మా, నన్ను బతకనీడు' అనేది.
కూరల మార్కెట్టు, రైతు బజారు ఇవన్నీ ఎక్కడో తెలుసుకుని, బయటికి వెళ్లి కూరలు, సరుకులు పట్టుకొచ్చేది . 'సూపర్ మార్కెట్‌కి వెళ్తే చాలుగా ముత్యాలూ' అంటే..
'నాలుగు చోట్ల రేట్లు కనుక్కోని తెచ్చుకోవాలమ్మా. నేనున్నా గదా, తెస్తా పద' అనేది. తనే ఒక్కతే వెళ్లి అన్నీ కొనుక్కు తెచ్చేది.
రాను రాను మాకు అర్థమైందేమిటంటే, ముత్యాలుకి ఇంటిపట్టున ఉండి చేసే పని కంటే బయట తిరిగే పన్లే ఇష్టం అని.
మరో నెల తర్వాత ఒక ఆదివారం ఉదయాన, ముత్యాలు తన మనసులో మాట బయటపెట్టింది.
రైతు బజారు పక్క సందులో చాలా మంచి రెసిడెన్షీల్ కాలనీ ఉందట. అక్కడ బజ్జీల బండి పెట్టాలని తన కోరిక.
'కూరల కోసం పొయినపుడు చూశానమ్మా. ఆ బజారెంత బాగుందనీ. సుట్టూ ఇళ్లున్నాయి, కానీ ఎట్టా ఉన్నయ్యంటే, కిందంతా కొట్లు, పైనేమో ఇళ్లు. రెండు మూడు కాలేజీ ఆస్టళ్లు ఉన్నాయి. బేరం బాగా జరిగిద్దమ్మా. ఒక బండి ఉంది. కానీ ఆణ్ణి పొయిలో బెట్ట, బజ్జీ సరిగా ఏగితేనా? పచ్చి పచ్చిగా ఉంది. లోపల మిరగాయ కూడా కసా బిసా అంటుందమ్మా. పునుగులైతే పులుపు రొడ్డు. ఆళ్లు అసలు అందులో మినప్పప్పే ఎయ్యలా. మైదా ఏసినారు. మనం బండిగానీ పెట్టామంటే తిరుగులేదు. కలకల్లాడి పోతది. సరుకు బాగుండాలమ్మా. అదొక్కటే సాల్దు, వొచ్చినోడితో సెర్దగా మాట్టాడాల గదమ్మా, ఆడి మొహం పాడు గాను, రెండోసారి అడిగితే ''ఏందమో, అంత జల్దీ, ఆగలేకపోతే పో!'' అన్నాడు. మనం నవ్వుతా మాట్టాడితేనే గదా, రెండోసారి మన బండి కాడికి వస్తారు?' అని గొప్ప వ్యాపార విశ్లేషణ చేసింది.
ముత్యాలు పరిశీలనకి నిజంగానే ఆశ్చర్యం వేసింది.
ఏమీ మాట్లాడలేదు. అమత, అనిత, విశాలి ఎవరూ ముత్యాలు ఆలోచనని స్వాగతించలేదు.
'ఏం పిచ్చి పన్లు ఇవి? అసలు కాంపౌండ్ దాటే పని కూడా లేదు. నాలుగిళ్లలో పని, కడుపు నిండా తిని, టీవీ చూస్తూ నీడ పట్టున ఉండవే అంటే, రోడ్డు మీద నిలబడి, కాళ్లు విరిగే పని చేస్తానంటావ్?'
ముత్యాలు అసంతృప్తిగా చూస్తూ కూచుంది.. మాట్లాడ్డానికి కొంచెం జంకుతూ.
విశాలి అత్తగారు 'ఇదిగో, అట్లా బజ్జీల బండి పెట్టేగా ఈ గతి పట్టింది నీకు? కొట్టన్నాక పదిమంది మగవాళ్లు రాకా మానరు, నువ్వు మాట్లాడకా మానవు. నీ తత్వం అది. దానికేగా అంత గొడవ పడి, కాపరం కూడా వొదులుకున్నావు? మళ్లీ అలాటి పనెందుకు? ఆలోచించవేంటే నువ్వు? నీ మంచికే చెపుతున్నాం' అంది చివర్లో కొంచెం మెత్తగా.
ఆవిడ మాటలకు ముత్యాలు చాలా అవమానపడింది.
అప్పటివరకూ నిశ్శబ్దంగానే కూచున్నా.. అప్పుడు మాత్రం నోరు పెగల్చింది.
'గొడవలు నేను పడలేదమ్మగారూ..' నేను అన్నచోట ఒత్తి పలికింది.
'గొడవ ఒక పక్క సైడు నుంచే అవుతయ్యామ్మా? నేనీడకి వచ్చినప్పుడు నా ఒంటి మీద దెబ్బలు సూశావు గదా? నేను డబ్బులు సంపాదిచ్చాలంటే నాకిస్టమైన పని గదా సెయ్యాల? మగోళ్లతో మాట్లాడొద్దంటే ఎట్టా కుదురుద మ్మా? అట్టా జరగాలంటే అసలు మొగోళ్లే లేకుండా పోవాల పెపంచికాన. మొగోడై, నా మొగుడు అన్న మాటలే నువ్వూ అన్నావమ్మా!
నాకు అట్టా బండి పెట్టుకోటమంటే ఇస్టం. నేనే గాక నా దగ్గర ముగ్గురు మడుసులు పంజేసి, నాలుగు ముద్దలు తినేవాళ్లు. ఒకరి కింద పని సెయ్యడం తప్పు కాదమ్మా, కానీ నాకు అది నచ్చట్లా. అందరూ నీడ పట్టున కూకుంటే.. మరి నీడ లేని పన్లు గూడా ఎవురో ఒకరు సెయ్యాల గదా?' తెగేసింది.
ఆవిడ మొహంలో ఏ రంగులు మారాయో చూడకుండానే నాకు తెల్సు.
ఒకరి కింద పని చెయ్యను. నా కింద నలుగురు పని చెయ్యాలి! అంటోంది ముత్యాలు. వ్యవస్థాపకురాలిగా ఉంటానంటోంది. ఉద్యోగం వద్దట. ఆ మాటకి అర్థం ముత్యాలుకు తెలీక పోవచ్చు. ఎపుడూ విని ఉండకపోవచ్చు. నలుగురు మనుషులకు పని ఇచ్చి, అన్నం పెట్టాలనే ఆలోచన. చదువుకోని ముత్యాలు మనసులో సజీవంగా ఉండటమే కాక, అది కొత్త చిగుళ్లు వేస్తోంది.
'ముత్యాలూ.. వెళ్లు, బండి పెట్టుకో. లోను వస్తుందేమో నేనూ కనుక్కుంటాను. లోను రాకపోతే, నేనే ఇస్తాను డబ్బులు, బండి పెట్టు. నీతో పాటు మరో ఇద్దరికి పనివ్వు' అన్నాను స్థిరంగా.
ముత్యాలు సంభ్రమంగా చూసి, పరిగెత్తుకు వచ్చి నన్ను కౌగిలించుకుని, ఒక్క క్షణం ఆగి వెనక్కి జరిగింది.
000
బంతిపూల తోరణాలు కట్టిన బండి మీద.. భగ భగ మండుతున్న పొయ్యి మీద మూకుడు పెట్టి, కొంగి బిగించి ముత్యాలు బజ్జీలు చక చకా వేసేస్తోంది. ఇంతకు ముందు చూడని ఉత్సాహం, ఉత్తేజం ఆ మొహంలో.
బండి చుట్టూ జనం గుంపులుగా మూగి తింటున్నారు.
కూచోడానికి చెక్క స్టూళ్లూ, ఎకో ఫ్రెండ్లీ ప్లేట్లూ, నా ఐడియా.
మధ్యలో ఎడమ ముంజేయితో జుట్టు పైకి నెట్టుకుంటూ, నా వైపు చూసి సంతోషంగా నవ్వింది.
మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరతానంటే, అన్నయ్య ఎంత గొడవ చేశాడు?
'ఆడపిల్లవి, ఎందుకు అలాటి సబ్జెక్టు తీసుకోవటం? ఫిజికల్‌గా చాలా పనుంటుంది తెల్సా? హాయిగా కంప్యూటర్ సైన్స్ తీసుకో, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ తీసుకో. ఏసీలో కూచుని హ్యాపీగా 9 టు 5 ఉద్యోగం చేసుకోవచ్చు' అని వాదించాడు.
ఎంత కోపం వచ్చిందో..
'అందరూ ఏసీలో కూచుని పని చేస్తే మరి బయట నాన్ ఏసీలో ఎవరు ఒకరు పని చేయాలిగా? వాళ్లలో నేనుంటా!'' అని నా ఇష్టప్రకారమే చేశాను. మెకానికల్ సబ్జెక్టే తీసుకున్నా.
'అందరూ నీడపట్టున కూకుంటే, మరి నీడ లేని పన్లు ఎవురో ఒకరు సెయ్యాల గదా?' ముత్యాలు అన్న మాట.
మా ఇద్దరివీ ఒకే మాటలు, ఆశ్చర్యంగా.
ముత్యాలు ఇచ్చిన బజ్జీల ప్లేటు అందుకున్నాను.
సుజాత వేల్పూరి