
ప్రజాశక్తి-గుంటూరు : విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, కడప ఉక్కు ఏర్పాటు కోసం బుధవారం విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం అయ్యింది. విద్యార్థుల నుండి బంద్‌కు అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు చాలా వరకూ ప్రైవేటు యాజమాన్యాలు ముందురోజే సెలువు ప్రకటించాయి. కాగా అనేక ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థలను సంఘాల నాయకులు బంద్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, పిడిఎస్‌యు, ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ తదితర సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో జెండాలు చేతబూని బంద్‌లో పాల్గొన్నారు. స్థానిక హిందూ కాలేజి, ప్రభుత్వ ఉమెన్స్ కాలేజి, ఏసీ కాలేజి, బిహెచ్, గురవయ్య తదితర విద్యా సంస్థలను నాయకులు బంద్ చేయించారు. ఏటి అగ్రహారంలోని మున్సిపల్ హైస్కూల్లో బంద్ చేయిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షులు సి.నరసింహాను పోలీసులు అదుపులోకి తీసుకొని కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని, ప్రస్తుతం లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. ప్లాంట్ అభివృద్ధికి ఎలాంటి చర్యలూ తీసుకోని కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తుందని విమర్శించారు. విభజన హామీలలో భాగంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి తొమ్మిదేళ్లవుతున్నా ఇంత వరకూ ఏర్పాటు చేయలేదన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పన ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయటం చేతగాని కేంద్రం ఉన్న పరిశ్రమలను తెగనమ్మటానికి పూనుకుందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు జోలికొస్తే చూస్తు ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాయలసీమ ప్రాంతంలో కడప ఉక్కు ఏర్పాటు చేస్తే ఆప్రాంత యువతకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమ ంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌కుమార్, డివై ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ వై.కృష్ణకాంత్, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్య క్షులు యు.గనిరాజు, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి నాసర్‌జీ, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య, వలి, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు కరీం, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సుచరిత, నగర కార్యదర్శి సమీర్, నాయకులు ఆరిఫా, శ్రీలక్ష్మీ, భగత్‌సింగ్, హర్ష, డివైఎఫ్‌ఐ నాయకులు కిరణ్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : పట్టణంలోని విద్యాసంస్థలను ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఎప్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి పి.మున్నా మాట్లాడారు. మంగళగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ పాఠశాలు, ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అష్రఫ్, సందీప్, రోఫా, వీరేంద్ర, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు అజరు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పొన్నూరు రూరల్ : పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో పాఠశాలలను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బంద్ చేయించారు. ఎస్‌ఎఫ్‌ఐ పొన్నూరు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జావీద్, జమీర్ మాట్లాడారు. డివైఎఫ్‌ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే ఫకీర్, హర్షవర్ధన్, ఎస్‌ఎఫ్‌ఐ నాయ కులు సమీర్, పవన్, బాష, అబ్దుల్, సాహిల్ పాల్గొన్నారు
ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్ : మండల కేంద్రమైన పెదనందిపాడుతోపాటు అన్నపర్రు, పాలపర్రు తదితర గ్రామాల్లోని పాఠశాలలను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బంద్ చేయించారు. మండల అధ్యక్ష కార్యదర్శులు యశ్వంత్, అర్జున్ మాట్లాడారు. అభి, రమేష్, సాయిరాం, శ్రీనివాస్ పాల్గొన్నారు.