ప్రజాశక్తి - అద్దంకి
పట్టణంలోని కాకానిపాలెం మండపం వద్ద ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ ఆర్థిక సహకారం, దాతలు సహకారంతో సమకూర్చిన రూ.10లక్షల నిధులతో ఏర్పాటు చేసిన శుద్ధ జల ప్లాంట్ గత 3రోజుల నుండి మూత పడింది. దీంతో పట్టణంలోని ఉత్తర అద్దంకి, బొమ్మంనంపాడు, చేరువుకొమ్ముపాలెం, కశ్యాపురం గ్రామాల ప్రజలకు తాగునీరు లేక ఎన్నోఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ప్రజలకు తాగు నీరు అందించే శుద్ధ జల వాటర్ ప్లాంట్ పునరుద్ధరించి వాటర్ ప్లాంట్ అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికీ పట్టణంలో దాదాపుగా ఐదు రోజుల నుండి నీరు విడుదల లేకపోవడంతో ట్యాంకర్ల సహాయంతో గృహ యజమానులు నీటిని తరలించుకుంటున్నారు.










